కేంద్ర బడ్జెట్‌లో ఇతర దేశాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయంగా కేటాయించిన నిధుల వివరాలు ప్రస్తుతం చర్చినీయాంశంగా మారాయి.
న్యూస్ లైన్ డెస్క్: మంగళవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం రూ. 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన అనేదే లేదు.
దీంతో ప్రాంతీయ పార్టీ అయిన BRS.. కేంద్ర బడ్జెట్‌పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కొంత కూడా కేటాయించకపోవడం సరికాదని, నాలుగు ఎంపీ స్థానాల నుండి రెట్టింపు చేసి ఎనిమిది స్థానాలకు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. కేంద్ర బడ్జెట్‌లో ఇతర దేశాలకు ప్రభుత్వం ఆర్ధిక సహాయంగా కేటాయించిన నిధుల వివరాలు ప్రస్తుతం చర్చినీయాంశంగా మారాయి. ఓవైపు బీహార్, ఏపీ తప్ప ఇతర రాష్ట్రాలను కనీసం పట్టించుకోలేదని చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర బడ్జెట్‌లోని ఇతర దేశాలకు అర్దిక సహాయంగా.. కోట్లకు కోట్లు కేటాయించడంపై మరో దుమారం రేగుతోంది.
కేంద్ర బడ్జెట్‌లో భూటాన్ కోసం రూ. 2068 కోట్లు, నేపాల్ కు రూ.700 కోట్లు, మాల్దీవులకు రూ.400 కోట్లు, మారిషస్ కోసం రూ.370 కోట్లు, శ్రీలంకకు రూ.245 కోట్లు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు, ఇండియాలోని దక్షిణ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించింది మాత్రం 'సున్నా'. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ నుండి ఒక్క రూపాయి కూడా రాలేదు. దీంతో మాల్దీవులకు టూరిజం కోసం వెళ్లవద్దని స్వయంగా చెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ దేశానికి రూ. 400 కోట్లు సహాయం చేశారు.
దీంతో ఇండియాలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్రం ఎందుకు ఇంత వివక్ష చూపుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు 8 ఎంపీ స్థానాల్లో బీజేపీ నేతలను గెలిపించిన పాపానికి మా రాష్ట్రానికి '0' నిధులు కేటాయించారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.