ఇప్పుడు గురుకుల విద్యార్థులే కళ్లలో నీళ్లు నింపుకుంటున్నారని ఆయన అన్నారు. పిల్లలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హరీష్ రావు అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రేవంత్ రెడ్డి.. ఒక ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. శనివారం హరీష్ రావు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాలమాకుల గురుకుల పాఠశాలకు వెళ్లి విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వచ్చాక 500 మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు చనిపోయారని ఆయన గుర్తుచేశారు. గురుకులాల్లో ఓవైపు విద్యార్థులు పాము కాటుకు చనిపోతున్నారని.. మరోవైపు ఎలుకలు కరిచి, విషాహారం తిని ఆస్పత్రుల పాలవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మొద్దునిద్రలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఒకప్పుడు గురుకులాలంటే దేశానికే ఆదర్శం. కానీ, ఇప్పుడు గురుకుల విద్యార్థులే కళ్లలో నీళ్లు నింపుకుంటున్నారని ఆయన అన్నారు. పిల్లలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని హరీష్ రావు అన్నారు.
విద్యార్థుల పరిస్థితి చూస్తే బాధేస్తోందని హరీష్ రావు అన్నారు. మీరు వెళ్లిపోయాక మమ్మల్ని మళ్లీ కొడతారు అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, భయపడుతున్నారని ఆయన తెలిపారు. పిల్లలను కర్రలు విరిగిపోయేలా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు, గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమని చెప్తున్నారు. అటు విద్య లేదు ఇటు సరైన భోజనం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి విద్యార్థులు బాధపడుతున్నారని ఆయన అన్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు రెండో జత ఇప్పటివరకు ఇవ్వలేదని, బుక్స్ కూడా ఇవ్వలేదని 6వ తరగతి విద్యార్థులు చెప్తున్నారని హరీష్ రావు వెల్లడించారు.
ఇక్కడ ఉన్న టీచర్లను మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థినులకు మంచి భోజనం పెట్టాలని ఆయన సూచించారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది, సోషల్ వెల్ఫేర్ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది మీ శాఖలోనే ఈ రకంగా జరుగుతుంటే నువ్వు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను గుంజుకోవడం, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడం వంటి వాటిపై ఉన్న శ్రద్ధ పేద విద్యార్థినుల సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన సీఎంకు లేదని ఆయన విమర్శించారు.