BRS అధికారంలో ఉండగా తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన గుర్తుచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. అనేక విప్లవాత్మక పథకాలకు BRS ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందని హరీష్ రావు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ పాలనలో మళ్లీ 'నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు' అనే రోజులు వచ్చాయని మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పడిన పరిస్థితులపై ఆయన ట్వీట్ చేశారు. BRS అధికారంలో ఉండగా తెలంగాణ వైద్య రంగం ఉన్నత శిఖరాలకు చేరిందని ఆయన గుర్తుచేశారు. దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. అనేక విప్లవాత్మక పథకాలకు BRS ప్రభుత్వం శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేసిందని హరీష్ రావు తెలిపారు.
కానీ, ఈ తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో వైద్యారోగ్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ హయాంలో హాస్పటల్లో ఘనతను చాటేలా వార్తలు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆస్పత్రుల్లో అధ్వాన్న పరిస్థితుల గురించి రోజూ వార్తలు వస్తున్నాయని తెలిపారు. పడకేసిన ప్రజారోగ్యం,
రోగుల మందులు ఎలుకల పాలు, కుర్చీలోనే గర్భిణీ డెలివరీ, ఒకే బెడ్‌పై ముగ్గురికి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితులు వచ్చాయని ఆయన వెల్లడించారు.
ఇవన్నీ ఈ ఒక్క రోజు పత్రికల్లో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వాకంపై వచ్చిన వార్తా కథనాలు అని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని హరీష్ రావు విమర్శించారు. వానాకాలం వస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆస్పత్రుల సన్నధ్ధతపై సమీక్షలు నిర్వహించకపోవడం పారిశుధ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయని తెలిపారు.
పల్లె, పట్టణం అని తేడా లేకుండా వైరల్ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలంటే ఇంకా ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య ఆరోగ్యశాఖపై అత్యవసర సమీక్ష నిర్వహించాలని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.