హెచ్‌సీయూ భూములు
రాబర్ట్ వాద్రాకే..!
రూ.40 వేల కోట్ల భూమిని..
రూ.20 వేల కోట్లకే ఇచ్చేందుకు కుట్ర
పదవి కాపాడుకునేందుకు రేవంత్ తిప్పలు
సర్కారు.. ప్రజాపాలన గాలికి వదిలేసి..
రియల్ ఎస్టేట్ దందా కోసమే పని చేస్తోంది
గుంట నక్కలు ఎవరో రేవంత్ చెప్పాలి
రాష్ట్రంలో నిర్బంధ, అరాచక పాలన సాగుతోంది
ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నారని ఇప్పటి వరకు ఆరోపణలు వచ్చాయి. కానీ ఇందులో మరో కుట్ర కోణం దాగుందనే విషయం బయటకు వచ్చింది. బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొత్త కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఈ భూములపై రేవంత్ సర్కారు ఇంత పట్టింపుతో ఉండటానికి ఖచ్చితంగా అదే కారణమా అన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 1) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రూ.40 వేల కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్ల భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని విమర్శించారు. ఇక భూములను అమ్ముకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందన్నారు. అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడమా..? అని ప్రశ్నించారు. భూములు అమ్మడం, రియల్ ఎస్టేట్ దందా చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అనేది స్పష్టం చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తామని, విద్యార్థులను కలసి చైతన్య పరుస్తామని చెప్పారు.
సెంట్రల్ యూనివర్సిటీ భూములను రేవంత్ రెడ్డి ఏదో రకంగా అమ్ముకోవాలని, దందా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులపై లాఠీ ఝులిపించడం.. విద్యార్థుల నెత్తురు కళ్ల చూడటం ప్రజాపాలన అవుతుందా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ దందా కోసమే కాంగ్రెస్ సర్కార్ పని చేస్తోందని వ్యాఖ్యానించారు. యూనివర్సిటీ భూముల్లో విశేష జంతు సంపద ఉందని, అలాంటి ఫారెస్ట్ భూమిని విధ్వంసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇక గుంట నక్కలు ఎవరో రేవంత్ చెప్పాలన్నారు. ఈ విషయంలో శ్రీధర్ బాబు, రేవంత్ రెడ్డి మాటలకు పొంతన లేకుండా ఉన్నాయని అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులను భేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ భూములపై ముఖ్యమంత్రి అఖిలపక్ష కమిటీ వేయాలని కోరారు. కూనంనేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరాంలకు సెంట్రల్ వర్సిటీ భూములపై విద్యార్థుల పోరాటాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఎందుకు పార్టీ ఆఫీసులకే పరిమితం అయ్యారు? నిజ నిర్ధారణ కమిటీ వేసి ప్రభుత్వం.. భూములపై లెక్కలు తేల్చేంతవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దేశ భద్రత, దేశం కోసం, భావితారాల భవిష్యత్ కోసం ఆలోచన చేస్తే దానికి తాము ఉంటామని అన్నారు. కానీ రియల్ ఎస్టేట్ కోసం భూములను అమ్ముకుంటే అడ్డుకుంటామని స్పష్టం చేశారు.