తెలంగాణ నుండి కేంద్రమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన అనేదే లేదు. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన BRS కేంద్ర బడ్జెట్‌పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అన్ని కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కొంత కూడా కేటాయించకపోవడం సరికాదని మండిపడుతున్నారు. నాలుగు ఎంపీ స్థానాల నుండి రెట్టింపు చేసి ఎనిమిది స్థానాలకు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడుతున్నారు.
తెలంగాణ నుండి కేంద్రమంత్రిగా ఎన్నికైన బీజేపీ నేత కిషన్‌రెడ్డి మాత్రం ఇందుకు విరుద్ధంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బడ్జెట్ సమతుల్యంగా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ ఉందని ఆయన తెలిపారు. పేదలను శక్తివంతం చేయడం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. 4 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారని కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో పెట్టామని అన్నారు.
అయితే, కేంద్రమంత్రి పదవిలో ఉంది మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌పై ఆయన సంతృప్తి వ్యక్తం చేయడంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గెలిపించిన కేంద్ర మంత్రి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రానప్పుడు ఎలా సమర్ధిస్తారని ప్రశ్నిస్తున్నారు. కిషన్‌రెడ్డి ఇప్పటికైనా అబద్దాలు మానుకోవాలని సూచిస్తున్నారు.