కాంగ్రెస్ పాలిత ప్రాంతాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివక్ష చూపుతున్నారని, అందుకే కేంద్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మొత్తం రూ. 48,21,000 కోట్లతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన అనేదే లేదు. మరోవైపు ఏపీ, బీహార్ రాష్ట్రాలపై మాత్రం కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది.
దీంతో ప్రాంతీయ పార్టీ అయిన BRS.. కేంద్ర బడ్జెట్‌పై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని కోట్ల బడ్జెట్‌లో తెలంగాణకు కొంత కూడా కేటాయించకపోవడం సరికాదని, నాలుగు ఎంపీ స్థానాల నుండి రెట్టింపు చేసి ఎనిమిది స్థానాలకు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివక్ష చూపుతున్నారని, అందుకే కేంద్ర బడ్జెట్‌లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
ఇక తాజాగా, జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా బడ్జెట్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దీనిపై నిర్మలా సీతారామన్ ఎట్టకేలకు నోరు తెరిచారు. ఏ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రయోజనం చేకూర్చలేదని ఆమె అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయించలేదని అన్నారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన.. ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని అర్థం కాదని ఆమె అన్నారు.