గురుపూజా దినోత్సవ వేళ వేలాది గురుకుల టీచర్లు రోడ్డున పడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: గురుపూజా దినోత్సవ వేళ వేలాది గురుకుల టీచర్లు రోడ్డున పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6,200 మంది పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లను అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని గురుకుల టీచర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సబ్జెక్ట్ అసోసియేట్, గెస్ట్ ఫ్యాకల్టీ, పార్ట్ టైం టీచర్లతో పాటు కోచ్, డేటా ఎంట్రీ అపరేటర్లను తొలగిస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల సెక్రటరీ ఉత్తర్వులు జారీపై టీచర్లు ఖండిస్తున్నారు.
ప్రభుత్వం తొలగించిన వారిని వెంటనే చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ గురుకుల సెక్రటరీ కార్యాలయం ఎదుట సబ్జెక్ట్ అసోసియేట్, గెస్ట్ ఫ్యాకల్టీ, డీఈఓలు, స్పోర్ట్స్ కోచ్ టీచర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని అడిగినందుకు ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారు అంటూ టీచర్లు మండిపడుతున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే గురుకుల సెక్రటరీ మేడంను కలిసేందుకు 5 గురికి మాత్రమే అనుమతి అని లోపలికి పంపించి వారు అక్కడ ఉండగానే వెనుక గెట్ నుంచి సెక్రటరీ అలుగు వర్షిణి వెళ్లిపోయారు. కాగ, అలుగు వర్షిణి వెళ్లిపోవడంతో సబ్జెక్ట్ అసోసియేట్, గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అనడానికి నిదర్శనం సమాధానం చెప్పకుండా సెక్రటరీ వెళ్లిపోవడమే అంటూ గురుకుల గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్లు మండిపడుతున్నారు.