Unemployed: పట్టువదలని డీఎస్సీ అభ్యర్థులు

రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక వీడియో బయటికి రావడంతో చాలా మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపొతుందని గ్రహించిన పోలీసులు.. వారిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నిరుద్యోగులు మేం ఎక్కడికి వెళ్లేది లేదంటూ రోడ్ల మీదికి వచ్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిటీ కాలేజ్ నుంచి ర్యాలీగా బయల్దేరిన వందలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు పాదయాత్రగా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చారు. 


Published Jul 09, 2024 03:18:14 AM
postImages/2024-07-09/1720510375_modi60.jpg

డీఎస్సీ అభ్యర్థుల పోరాటం 
చెప్పులు లేకుండా ర్యాలీ 
అభ్యర్థుల్లో చిన్నారుల తల్లులు
నీరు కూడా ఇవ్వకుండా నిర్బంధం 

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ మూడు నెలల వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యాశాఖను ముట్టడి చేశారు డీఎస్సీ అభ్యర్థులు. ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులను అందరినీ అరెస్ట్ చేసి రాత్రి తొమ్మిది గంటల వరకు సిటీ కాలేజ్ దగ్గరే పోలీసులు నిర్భంధించారు. అందులో మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిలో కొందరు చంటిపిల్ల తల్లులు కూడా ఉన్నారు. కనీసం అక్కడ వారికి తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వకుండా, తినడానికి కూడా ఏమి దొరకకుండా ఇబ్బందులకు గురి చేశారు. ఆఖరికి లైట్స్ ఉంటే.. వీడియోలు తీస్తున్నారని నిరుద్యోగులు ఉన్న ప్రాంతంలో లైట్స్ కూడా ఆపేసి వారిని భయబ్రాంతులకు గురి చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒక వీడియో బయటికి రావడంతో చాలా మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లోని సిటీ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. పరిస్థితి చేయి దాటిపొతుందని గ్రహించిన పోలీసులు.. వారిని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో నిరుద్యోగులు మేం ఎక్కడికి వెళ్లేది లేదంటూ రోడ్ల మీదికి వచ్చారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో సిటీ కాలేజ్ నుంచి ర్యాలీగా బయల్దేరిన వందలాది మంది నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు పాదయాత్రగా ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్నారు. కొందరు మహిళా అభ్యర్థులు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వచ్చారు. 

అద్దమరాతిరి 12 గంటలకు అలా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీకి చేరుకున్నారు. ఆర్ట్స్ కాలేజీ ముందు కూర్చుని వాళ్ల నిరసనను వ్యక్తం చేశారు. వాళ్ల ప్రధాన డిమాండ్ అయిన డీఎస్సీని మూడు నెలల వాయిదా వేయాలని కోరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఒకటిరెండు మీడియా ఛానెళ్లతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు కావొచ్చని అందరు అనుకున్నారు. కానీ, వాళ్లు మొక్కవోని దీక్షతో పట్టువదలని విక్రమార్కుల్లా డీఎస్సీ వాయిదా వేసే వరకు ఆర్ట్స్ కాలేజీని వదిలేది లేదని.. అక్కడే బైటాయించారు. రాత్రంతా అక్కడే దోమలతో నిద్రలేని రాత్రి గడిపారు తెలంగాణ నిరుద్యోగులు. తెల్లవారుజామున డీఎస్సీ అభ్యర్థుల్లోని కొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎక్కడికి తరలించారు ఇంకా చెప్పలేదు. కానీ..ఇంకా కొందరు ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. మరోవైపు పోలీసులు, స్పెషల్ ఫోర్సెస్‌తో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మొద్దునిద్ర పోతున్న రేవంత్ సర్కార్..! ఇదేనా ప్రజాపాలన..!
రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. డీఎస్సీ అభ్యర్థుల పోరాటంపై ముఖ్యమంత్రి కాదుకదా కనీసం ఒక్క మంత్రి గానీ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. తెల్లవార్లు మహిళలు నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే.. ఆఖరికి ప్రభుత్వంలో, కాంగ్రెస్‌లో ఉన్న మహిళా మంత్రులు, మహిళా నేతలు కూడా స్పందించకపోవడం విచారకరం. 

డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా న్యూస్ లైన్ తెలుగు టీం 
సిటీ కాలేజ్ దగ్గర డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు నిర్బందించారనే విషయం తెలుసుకున్న న్యూస్ లైన్ తెలుగు టీం.. సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. నిరుద్యోగులు ఉన్న ప్రాంతానికి తొలుత మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. మీడియా మీద దురుసుగా ప్రవర్తించారు. అరెయ్ తొరెయ్‌లు కొట్టారు. లోపల ఉన్నవాళ్లకు కనీసం మంచినీళ్లు ఇస్తామన్నా అనుమతించలేదు. తర్వాత 9 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరిన అభ్యర్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దాకా వచ్చారు. వారి వెంటే న్యూస్ లైన్ తెలుగు టీం కూడా పాల్గొన్నది. వారి నిరసన పాదయాత్రను ప్రత్యక్షప్రసారం చేస్తూ వారితో కలిసి నడుచుకుంటూ మా టీంతో కలసి వెళ్ళాం . మార్గమధ్యంలో కొందరు మహిళా అభ్యర్థులు నడవలేక, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు నిజంగా మా కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. వారిలో కొందరని మా న్యూస్ లైన్ మీడియా వాహనంలో ఎక్కించుకుని వాళ్ల పోరాటంలో పాలుపంచుకున్న సందర్భం చాలా సంతృప్తిని ఇచ్చింది. దాదాపు 15 కిలోమీటర్లు.. దారిపొడవునా వాళ్లతో మాట్లాడుతుంటే వాళ్ల ఆవేదన, వాళ్ల పట్టుదల చూస్తే మరోసారి తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. మార్గమధ్యంలో కొందరు మిత్రులు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చారు. న్యూస్ లైన్ తెలుగులో లైవ్ చూసి మేం వచ్చామన్నా అని చెబితుంటే తెలంగాణ గడ్డ మీద ఉన్న పోరాట పటిమ ఏంటో అర్థమైంది. నిన్నటి రాత్రి ఓయూ ఆర్ట్స్ దగ్గర దాదాపు తెల్లారే దాకా స్టే చేశాము. ఇదంతా చూస్తే ఆ నాటి ఉద్యమరోజులు గుర్తుకొచ్చాయి. నాడు ఉద్యమానికి ఊపిరిపోసిన ఓయూ.. నేడు మళ్లీ అలాంటి ఓ ఉద్యమానికి నాంది పలకబోతోందా అన్న సంకేతాలు కూడా కనిపించాయి. ఏది ఏమైనా నిరుద్యోగుల ఓట్ల మీద గెలిచిన ఈ ప్రభుత్వం.. వారి డిమాండ్లను నెరవేర్చాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఓ మీడియా సంస్థగా న్యూస్ లైన్ తెలుగు రాష్ట్రప్రభుత్వాన్ని కోరుకుంటోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu students tspolitics telanganam police strike dsc unemployed osmaniauniversity

Related Articles