KCR: ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు

Published 2024-07-04 18:57:06

postImages/2024-07-04/1720099626_kcrhero.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రతి రోజూ మాదిరిగానే గురువారం కూడా తమ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి నివాసానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ నర్సాపూర్ ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలనుండి తనను కలిసేందుకు వచ్చిన వారితో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్  మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, ప్రతిపక్ష పాత్రకూడా శాశ్వతం కాదన్నారు. మనకు ప్రజా తీర్పే శిరోధార్యం. వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్ధి తో నిర్వర్తించాలన్నారు. అధికారం కోల్పోయామని బాధపడడం సరియైన రాజకీయ నాయకుని లక్షణం కాదని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం కొనసాగే నిరంతర ప్రక్రియనే రాజకీయం, దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదన్నారు. ప్రజల్లో కలిసివుంటూ వారి సమస్యలమీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానాన్ని సాధించాలని కేసీఆర్ పునరుద్ఘటించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన సాగునీరు, తాగునీరు, నిరంతర విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా నేటి కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతున్నదని కేసీఆర్ అవేదన వ్యక్తం చేశారు. రాబోయేదిబీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి సాధించడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొనసాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు అధినేత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.