నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు.
న్యూస్ లైన్ డెస్క్: నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి.. పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పరామర్శలకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయి పోలీసుల్ని వెంట పెట్టుకుని పారిపోయారని ఎద్దేవా చేశారు. ఖమ్మం పట్టణంలోని కాలువ ఒడ్డు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం దగ్గరికి వస్తుండగా స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రజల్ని అరెస్టు చేయించడం దుర్మార్గమైన చర్య అని, దీనిని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై వరద రాజకీయాలు చేయాలనే ఆలోచనని తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలు వరదల వల్ల కష్టకాలంలో ఉన్న ప్రజల్ని రైతాంగాన్ని ఆదుకునేందుకు సత్వరమే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఇండ్లు కోల్పోయిన నిర్భాగ్యులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పశువులు గేదెలు మేకలు చనిపోయిన పెంపకదారులకు రైతులకు మరల వాటిని కొనుగోలు చేసుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ప్రాణా నష్టం జరిగిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని, క్షతగాత్రులైన వారికి ఉచిత వైద్య సదుపాయం కల్పించి వారి కోలుకునేంతవరకు వారికి ఆర్థిక భరోసా ప్రభుత్వం కల్పించాలని హరీష్ రావు పేర్కొన్నారు.