తన వద్దకు వచ్చిన లక్షన్నర విలువ చేసే ఫోనును సంబంధిత వ్యక్తికి అందజేసి విధి నిర్వహణలో తన నిబద్ధతను చాటుకున్నారు.
న్యూస్ లైన్ , డెస్క్ : ఖాకీలు అంటే కర్కశత్వం.. అవినీతిమయని ఈసడించుకుంటున్న రోజులు. కానీ, క్రమశిక్షణకు, నిజాయితీకి మారుపేరు అని తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు పోలీసులు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఐ నర్సయ్య ఈ కోవకు చెందిన వారే. పోలీస్‌గా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించడంలో ముందుండే నర్సయ్య.. తన వద్దకు వచ్చిన లక్షన్నర విలువ చేసే ఫోనును సంబంధిత వ్యక్తికి అందజేసి విధి నిర్వహణలో తన నిబద్ధతను చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక కర్మాన్ ఘాట్‌కు చెందిన రవి కిశోర్ కొన్ని రోజుల క్రితం కెనడా నుంచి నగరానికి వచ్చారు. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం తన మొబైల్‌ను పోగొట్టుకున్నారు. ఈ ఫోన్ ఆక్టోపస్ కానిస్టేబుల్ వెంకట్ నాయక్‌కు దొరకడంతో.. దాన్ని ఎస్ఐ నర్సయ్యకు అందజేశారు. అయితే ఆ ఫోన్ డిటెయిల్స్ ఏమీ లేకపోవడంతో.. సాంకేతికతను ఉపయోగించి పది రోజుల పాటు కష్టపడి.. చివరకు బుధవారం ఆ ఫోన్ తాలుకా వ్యక్తిని కనుగొన్నారు. గురువారం స్టేషన్‌కు రవి కిశోర్‌ను పిలిపించి సీఐ వినోద్ కుమార్ సమక్షంలో ఎస్ఐ నర్సయ్య అందజేశారు. తన ఫోన్ తిరిగి తనకు లభించడంతో రవి కిశోర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీఐ వినోద్, ఎస్ఐ నర్సయ్యకు, వెంకట్ నాయక్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.