దేశమంతా తిరిగి బీసీల కష్టాలు, న్యాయమైన కోరికలు తెలుసుకుని రిజర్వేషన్‌లతోనే న్యాయం జరుగుతుందని కేంద్రానికి, రాష్ట్రపతికి బీసీలకు 27శాతం రిజర్వేషన్‌లు ఉండాలని, రిజర్వేషన్‌లు నిండకపోతే మూడేళ్లు ఆ రిజర్వేషన్‌లు ఉండాలన్నారు. ప్రైవేట్ సెక్టార్‌తో పాటు ప్రమోషన్‌లలో కూడా ఉండాలని ప్రతిపాదనలు పంపారని ఆయన తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. బీసీల ఆరాధ్యదైవం, బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని బీసీ మండల్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కామారెడ్డి బీసీల డిక్లరేషన్ అమలుచేయాలని బీసీ హక్కుల దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని విమర్శించారు. బీసీ రిజర్వేషన్‌ల విషయంలో ఆనాడు నెహ్రూ పూటకో మాట మాట్లాడి, రోజుకో విషయం చెప్పి బీసీ రిజర్వేషన్‌కు అడ్డుపడ్డాడని ఆయన గుర్తు చేశారు. రెండువేల ఎకరాల భూస్వామిగా ఉన్న బిందేశ్వరి ప్రసాద్ సమాజం ఆకలి కన్నీళ్లు అర్థం చేసుకుని ఈ సమాజం కోసం ఆలోచన చేసిన గొప్ప మహనీయుడని అన్నారు. దేశమంతా తిరిగి బీసీల కష్టాలు, న్యాయమైన కోరికలు తెలుసుకుని రిజర్వేషన్‌లతోనే న్యాయం జరుగుతుందని కేంద్రానికి, రాష్ట్రపతికి బీసీలకు 27శాతం రిజర్వేషన్‌లు ఉండాలని, రిజర్వేషన్‌లు నిండకపోతే మూడేళ్లు ఆ రిజర్వేషన్‌లు ఉండాలన్నారు. ప్రైవేట్ సెక్టార్‌తో పాటు ప్రమోషన్‌లలో కూడా ఉండాలని ప్రతిపాదనలు పంపారని ఆయన తెలిపారు.
1990లో ఆయన రిపోర్ట్ ఇస్తే వీపి సింగ్ అమలు చేస్తామని ప్రకటిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అల్లకల్లోలం సృష్టించిందన్నారు. ఆనాటి లాగే ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట రోజుకో విషయం చెప్తూ బీసీల రిజర్వేషన్‌లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఆనాడు వీపి సింగ్ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టుకు పోయిందని, కులాల ఆధారంగా రిజర్వేషన్‌లు ఉండవద్దని వాదిస్తే దేశమే కుల వ్యవస్థపై నడుస్తోందని కోర్టు పేర్కొనడంతో 1992లో బీపీ మండల్‌రిపోర్ట్ ఆధారంగా 22శాతం రిజర్వేషన్‌లు అమలు చేసిందన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఆధికారం కోసం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉపన్యాసాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు అమలు చేస్తామని ప్రకటన చేసి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. అయితే బీసీల కోసం పోరాటం చేసిన బీపీ మండల్‌తో పాటు అట్టడుగు వర్గాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల చరిత్రను తెలియకుండా చేసి ఒకే కుటుంబం ఇక్కడ రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎక్కడ అమలు చేయాల్సి వస్తుందోనని కోర్టుల పూచి చూపి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆన్నారు. బీపీ మండల్ యాదవ కులంలో జన్మంచినా బీసీల కోసం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇంత పెద్ద బీసీ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకు అనేక కుట్రలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు బీసీలకు రాజకీయ అవకాశాలు రాకపోవడానికి కారణంగా కాంగ్రెస్ మోసపూరిత మాటలేనని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఒక మాట ఎన్నికల తర్వాత మరోమాట మాట్లాడి మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం అనాదిగా వస్తున్న నీతి అని, కాంగ్రెస్ నైజాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ డిక్లరేషన్ అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బీసీలంతా చైతన్యం వంతులై మహనీయుల స్పూర్తితో ముందుకు అడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరలు పాల్గొన్నారు.