THIRD MARRIAGE: భర్తకు మూడో పెళ్లి చేసిన ఇద్దరు భార్యలు 2024-06-30 15:50:22

సాధార‌ణంగా ఒక‌పెళ్లి చేసుకున్న త‌ర‌వాత మ‌రో పెళ్లి చేసుకునేందుకు చ‌ట్టం ఒప్పుకోదు. అలా చేసుకుంటే కేసులు త‌ప్ప‌వు. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అస‌లు ఒక పెళ్లి కావ‌డానికే క‌ష్టంగా ఉంది. అలాంటిది రెండో పెళ్లి ఆలోచ‌న కూడా రాదు. కానీ ఏపీలో ఒక వ్య‌క్తి రెండు పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా మూడో పెళ్లికి సిద్దం అయ్యాడు. ఇక ఆ మూడో పెళ్లిని మొదటి భార్య, రెండో భార్య దగ్గరుండి జరిపించడమే అసలు ట్విస్ట్.. ఈ ఘటన అల్లూరి జిల్లా పనెదబయలుమండంలో చోటు చేసుకుంది. 

మండలానికి చెందిన పండన్న అనే వ్యక్తికి పార్వతమ్మతో మొదటి వివాహం అయింది. కొన్ని సంవత్సరాలు ఎదురుచూసినా వీరికి సంతానం కలగలేదు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పార్వతమ్మ అనుమతివ్వడంతో పండన్న అప్పలమ్మ అనే మహిళలను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి 2007 సంవత్సరంలో ఒక బాబు జన్మించాడు. 

ఇక పండన్న రెండో సంతానం కోరగా ఇద్దరు భార్యలు కలిసి ఆయనకు మరో సంబంధం చూశారు. అంతే కాకుండా వారే పెళ్లి పెద్దలు అయ్యి లావ్య అనే అమ్మాయితో మూడో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి పత్రికలో ఆహ్వానించువారి స్థానంలో వారి పేర్లు, ఫోటోలను వేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.