అశాంతి వాతావరణంలో బతకలేక చాలామంది బంగ్లాదేశ్ విడిచి వెళ్లిపోతున్నారు. అందులో చాలామంది అక్రమంగా భారత్ లోకి చొరపడే ప్రయత్నం చేస్తున్నారని భారత ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్ : అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆ దేశం ప్రస్తుతం మిలటరీ పాలనలో ఉంది. ఏకంగా ప్రధాని నివాసాన్నే ఆందోళనకారులు ధ్వంసం చేశారంటే అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న అశాంతి వాతావరణంలో బతకలేక చాలామంది దేశం విడిచిపోతున్నారు. అందులో చాలామంది అక్రమంగా భారత్ లోకి చొరపడే ప్రయత్నం చేస్తున్నారని భారత ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
అక్రమంగా దేశంలోకి చొరబడ్డ బంగ్లాదేశీలు హైదరాబాద్ లో ఆశ్రయం పొందే అవకాశాలున్నయన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి గుర్తింపు పత్రాలు లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్రమంగా హైదరాబాద్ లో నివాసముంటున్న బంగ్లాదేశీయులను పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. హైదరాబాద్ లోని పాతబస్తీ, పహడీ షరీఫ్, కాటేదాన్, ఫలక్ నుమా తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో భారీసంఖ్యలో రొహింగ్యాలు ఉంటున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశీలు సైతం హైదరాబాద్ లోకి చొరబడుతున్నారనే సమాచారంతో నిఘా వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అప్రమత్తమయింది. కొత్త వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.