తమకు పురుగులన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని ఆరోపించారు. తాము ప్రశ్నిస్తే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకులే గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. హాస్టల్‌లో తమను కనీస వసతులు కూడా కల్పించడం లేదని నిరసన తెలిపారు. హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పురుగులన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని ఆరోపించారు. తాము ప్రశ్నిస్తే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని తెలిపారు.
వాడుకోవడానికి నీళ్లు కూడా లేవని వాపోయారు. సమస్యలు ఉన్నాయని సిబ్బందికి చెబితే చర్యలు తీసుకోవాల్సింది పోయి.. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారని విద్యార్థినులు వాపోయారు. భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. తమను టీచర్లు హింసిస్తున్నారని కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు.
కష్టపడి హాస్టల్ నుంచి బయటకు వచ్చామని.. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి దర్నా చేశారు. అయితే, అక్కడికి వచ్చిన DEOపై కూడా తమకు నమ్మకం లేదని విద్యార్థినులు వెల్లడించారు. దీంతో పోలీస్ అధికారి విద్యార్థినులకు నచ్చజెప్పారు. వారం రోజుల్లో సమస్యను CMO ఆఫీసుకు పంపించి, సమస్యను పరిష్కరించేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.