సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి దర్నా చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని పాలమాకులే గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చిన ఆందోళన చేశారు. హాస్టల్‌లో తమకు కనీస వసతులు కూడా కల్పించడం లేదని నిరసన తెలిపారు. హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పురుగులన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రోడ్డుపై బైఠాయించి దర్నా చేశారు.
ఈ అంశంపై మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు, నడిరోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రభుత్వ పట్టింపులేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారుతోందని ఆయన వెల్లడించారు. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారని హరీష్ రావు వెల్లడించారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా BRS నేతలు ఎన్ని సార్లు చెప్పినా.. ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నడిరోడ్డెక్కి నినదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన గుర్తుచేశారు. అందుకే గురుకులాల్లో ఉండే విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి పరిపాలన, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.