జర్నలిస్ట్ శంకర్ అరెస్ట్
అరెస్ట్ టైంలో పోలీసుల హైడ్రామా
సివిల్ డ్రెస్సుల్లో శంకర్ ఇంటికి పోలీసులు
అధికార పార్టీ నేతలు ల్యాండ్ కబ్జా చేశారని మాటలు
ఆ వెంటనే ఇంట్లోకి దూసుకెళ్లిన పోలీసులు
సివిల్ డ్రెస్సుల్లో ఒకేసారి ఇంట్లోకి దూసుకురావడంతో..
భయపడిన మహిళలు, పిల్లలు
నేరుగా బెడ్ రూంలోకి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసు కార్లు కాకుండా వేరే వాహనాల్లో తరలించే ప్రయత్నం
పోలీసులో, గూండాలో తెలియక ఆందోళన
బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లిన పోలీసులు
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 29) : జర్నలిస్ట్ శంకర్ ను పోలీసులు శనివారం ఉదయం ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ సందర్భంగా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మొదట బాధితుల లాగా ఇంటికి వచ్చారు. తమ భూమిని ఎవరో కబ్జా చేశారని.. జర్నలిస్ట్ శంకర్ తో ఆ అంశం గురించి మాట్లాడాలని కుటుంబసభ్యులను అడిగారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో పడుకున్నారని కాసేపు ఆగాలని చెప్పారు. కానీ ఒకరితర్వాత ఒకరు దూసుకొచ్చిన పోలీసులు నేరుగా ఇంట్లోకి వెళ్లారు. ఇదంతా గమనించిన కుటుంబసభ్యులు మీరంతా ఎవరని నిలదీశారు. వాళ్లలో ఏ ఒక్కరు కూడా పోలీసు యూనిఫాంలో లేరు. అందరూ సివిల్ డ్రెస్సుల్లోనే వచ్చారు.
ఆ తర్వాత తాము పోలీసులమని బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంట్లోకి చొరబడ్డారు. దీంతో కుటుంబసభ్యులు జర్నలిస్ట్ శంకర్ ను నిద్రలేపారు. వెంటనే పోలీసులు బెడ్ రూములోకి వచ్చి లాక్కేళ్లే ప్రయత్న చేశారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు, మొహం కడుక్కునేందుకు కూడా సమయం ఇవ్వలేదు. చాలా సేపు అడగడంతో బాత్రూం డోర్ తెరిచి ఉంచి మొహం కడుకునే వరకు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత బయటకు తీసుకొచ్చినా.. అక్కడ పోలీసువాహనాలు మాత్రం లేవు. ఏదో ప్రయివేటు వాహనాన్ని ఇంటి ముందు నిలిపి అందులోకి ఎక్కాలని బలవంతపెట్టారు. దీంతో కుటుంబసభ్యులు ప్రతిఘటించారు. అసలు వారు పోలీసులేనా.? లేకపోతే ఎవరైనా గూండాలా.? అనేది కూడా అర్థం కాని పరిస్థితి. పోలీస్ స్టేషన్ వరకు తన కారులో వస్తానని.. తనతో పాటు పోలీసులు కొందరు తన కారులో రావాలని సూచించినా వారు వినలేదు. తాము తీసుకొచ్చిన ప్రయివేటు కారులోకి బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరో కారులో కుటుంబసభ్యులు ఆ కారును ఫాలో అయ్యారు. చివరకు అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉదయమే జర్నలిస్ట్ శంకర్ ను అరెస్ట్ చేసినా.. అధికారికంగా మాత్రం మధ్యాహ్నం తర్వాత అరెస్ట్ చేసినట్టుగా చూపించారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడా జైలుకు తరలించారు. శంకర్ ఫోన్, లాప్ టాప్ తో పాటు కారును కూడా పోలీసులు సీజ్ చేశారు.