రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం..!


Published Apr 02, 2025 11:21:34 AM
postImages/2025-04-02/1743573094_1600x960316167payalshankar.jpg

రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం..!
భూములన్నీ అమ్ముకుంటూ పోతే..
విశ్వనగరం ఎలా అవుతుంది
భూములు కాపాడాలి కానీ అమ్ముకోవద్దు
సర్కార్ పై బీజేపీ నేత పాయల్ శంకర్ ఆగ్రహం
HCU వెళ్తున్న శంకర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు


తెలంగాణం, హైదరాబాద్ (ఏప్రిల్ 1): భూములను రక్షించడం ప్రభుత్వం బాధ్యత కానీ  అమ్ముకోవడం కాదని, వెంటనే HCU భూముల వేలాన్ని విరమించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్‌పాల్ సూర్యనారాయణ  డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఈ భూములన్నీ అమ్ముకొని.. రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోవడం ఖాయమని ఆరోపించారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని కాపాడాలంటూ విద్యార్ధులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. మంగళవారం యూనివర్శిటీకి వెళ్తున్న  బీజేపీ బృందాన్ని హైదర్‌గూడ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత  ఏర్పడింది. బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ పోతే.. హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. 

హెచ్‌సీయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇది ప్రజాపాలనా? లేక నియంత పాలనా? అని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా, "ప్రభుత్వ భూములు అమ్మడానికా ప్రభుత్వాలు? భూములు అమ్మాలనుకుంటే ప్రభుత్వాలు ఎందుకు? రియల్ ఎస్టేట్ ఏజెంట్లకే అప్పగిస్తే సరిపోతుంది" అని ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆయన స్వయంగా ప్రభుత్వ భూములు అమ్మే ప్రయత్నం చేయడం మూర్ఖత్వమని అన్నారు. ఇలా ప్రభుత్వ భూములు అమ్ముతూ పోతే ప్రజల భవిష్యత్ ఏంటని అన్నారు. ఇప్పటికే కాలుష్య ప్రభావిత నగరాల్లో హైదరాబాద్, ఢిల్లీ తర్వాతి స్థానం పొందే ప్రమాదం ఉందని అన్నారు. ఒకవైపు "హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చుతామంటూ హామీలు," మరోవైపు పర్యావరణానికి హాని చేసే నిర్ణయాలు తీసుకుంటే విశ్వనగరంగా మారుతుందా అంటూ ప్రశ్నించారు.  

విద్యార్థులు యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తే, వారిపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేయడం దారుణన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు హెచ్‌సీయూ వద్ద పరిస్థితిని, వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. "కంచెలు తొలగించి స్వేచ్ఛనిచ్చాం" అని చెప్పే ప్రభుత్వం, శాసనసభ్యులకు స్వేచ్ఛను అడ్డుకోవడం ఏమిటి? ఇదేనా ప్రజాపాలన...? అంటూ నిలదీశారు. 400 ఎకరాల హెచ్సీయూకు ఆనుకుని ఉన్న భూమిని ఇప్పుడు అవసరాలకు అమ్మితే భవిష్యత్తులో అవే భూములు అవసరమైతే తిరిగి తీసుకురాగలరా..?  అంటూ నిలదీశారు. కంచెలు తొలగించి స్వేచ్ఛనిచ్చామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం  రాష్ట్రంలో శాసనసభ్యులు కూడా స్వేచ్ఛగా యూనివర్సిటీ వద్దకు వెళ్లనివ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, భూముల అమ్మకాన్ని అడ్డుకునేందుకు బీజేపీ ప్రజల పక్షాన ఎంతవరకైనా పోరాడుతుందని పాయల్ శంకర్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy students congress police bjp

Related Articles