ఆగస్టు 15న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి రైతులను మోసం చేశారని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆగస్టు 15న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు అరకొర చేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చుట్టు తిప్పి మిగిత హామీలను విస్మరిస్తుందని మండిపడ్డారు. అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే అది రేవంత్ సర్కారుకు దక్కుతుందని విమర్శించారు. బడాయిల బచ్చిగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు అన్నట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు తెలంగాణ ప్రజలు చెప్పుకునే ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి అన్నారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పాడు. జనవరి 6న ఓ మీడియా ఛానల్‌తో ఒకటి, రెండు నెలలలో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డే ప్రకటించాడు. మూడు విడతలలో రూ.31 వేల కోట్లు ఆగస్ట్ లోపలే పూర్తి చేస్తానని జులై 18న హామీ ఇచ్చాడు. జులై 28న అమెరికా వెళ్తూ రాగానే రుణమాఫీ చేస్తానని రేవంతే ప్రకటించాడు.. కానీ ఆగస్ట్ 15న రూ. 17,869 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకున్నాడని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి అందరి రైతుల రుణాలు మాఫీ అవుతాయని రేవంత్ ప్రకటించాడు. మరి రూ. 31 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు.
ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని, ఆరు గ్యారంటీలు గడువులోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు. ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలుచేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత హరీష్ రావు అన్నారు. ఏ బ్యాంకులో రైతుల రుణాలు మాఫీ అయ్యాయో సర్కారు చెబుతుందా? రుణమాఫీ అయిపోతే రాష్ట్రంలో రైతులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం 44 లక్షల మంది అని లెక్కలు చెబుతున్నది.. మరి ప్రభుత్వం ఎందుకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసిందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలుకంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ. 300 కోట్లు వరకు ఖర్చు చేశారు. బీఆర్ఎస్ పాలనలో రూ. 29 వేల కోట్లు రుణమాఫీ, రూ. 72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసి అండగా నిలిచామని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా విడత కింద ఒక్కసారికి రూ. 15 వేల కోట్లు అవసరం అవుతుంది.. రైతుభరోసా ఎగ్గొట్టి రూ. 17 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ఉపాధి హామీ కూలీలను వెన్నుపోటు పొడిచింది.. ఆసరా ఫించనుదారులను వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. నిరుద్యోగులను వాడుకుని ఓట్లేయించుకుని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిందన్నారు. గ్రామ పంచాయతీలతో పారిశుధ్య కార్మికులకు, పాఠశాలలో వంట కార్మికులకు వేతనాలు రాక గ్రామాలలో తండ్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మీ పథకం కింద రూ. 2,500 అని చెప్పి ఆ పథకం గురించి మాట్లాడడం లేదని, మాట మీద నిలబడిన హరీష్ రావును రాజీనామా చేయమనడం హస్యాస్పదం అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో చాలా విషయాలలో చక్కగా వ్యవహరిస్తున్నాడని, మరి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఎదుటి వ్యక్తులను అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడే హిందీ, ఇంగ్లీష్ భాషలు చాల చక్కగా ఉంటాయి.. అవి రేవంత్‌కు అర్ధంకానట్లుంది.. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
కేంద్రంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే అధికార పక్షం నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడుతారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత పదేళ్లలో వందేళ్ల విధ్వంసం అని అడ్డగోలు వాదనకు దిగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుతో మాట్లాడిన సీఎంకు తెలంగాణలో ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడి ఏ రైతుకు రుణమాఫీ జరిగిందో చెప్పడానికి సమయం లేదా అని ప్రశ్నించారు. రైతుభరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ, చర్చలు, శాసనసభలో చర్చలన్నీ పక్కకు పోయాయి.. జూలై 15కు నివేదిక అన్నారు.. ఆగస్టు 15 వచ్చినా గతి లేదన్నారు. కనీసం కృష్ణానదిలో పోతున్న నీటిని వడిసిపట్టుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదని, పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు వెలవెలబోతున్నాయి అన్నారు. కట్టిన రిజర్వాయర్లను నింపుకునే సోయి ప్రభుత్వానికి లేదని, గత ఎనిమిది నెలలలో తట్టెడు మట్టి తియ్యకుండా పనులు పక్కన పెట్టారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.