Cm Revanth: బీఆర్ఎస్ దెబ్బకి రేవంత్ యూఎస్ టూర్ మటాష్

బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ మొత్తం అట్టర్ ప్లాప్ అయ్యింది.


Published Aug 13, 2024 02:27:14 PM
postImages/2024-08-13/1723539434_brssocial.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ మొత్తం అట్టర్ ప్లాప్ అయ్యింది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట.. ఇప్పుడు ఈ సినిమా పాట సీఎం రేవంత్ పరిస్థితికి అద్దం పడుతుందని ప్రజలు అనుకుంటున్నారు. ఏదో నిరూపించుకుందామని అమెరికా పర్యటనకు వెళ్లిన రేవంత్‌.. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాస్తవానికి పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విదేశీ పర్యటనలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెళ్ళడం పరిపాటి. కానీ అందుకు భిన్నంగా కేవలం తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి జనవరిలో దావోస్ పర్యటనకు రేవంత్ వెళ్ళారు. అయితే అమెరికా, దక్షిణ కొరియాలకు కూడా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును పక్కకు నెట్టి మరీ రేవంత్ తిరుగుతున్నాడు. 


ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తున్నాడంటే సహజంగానే ఆ ట్రిప్‌పై అంచనాలు పెరుగుతాయి. సీఎం వేసే ప్రతి అడుగుని ప్రజలు, ప్రతిపక్షాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా సీఎం రేవంత్ తన అనుభవారాహిత్యాన్ని బయటపెట్టుకున్నాడు. పెట్టుబడులు విషయంలో ఏదో గొప్పలు చెప్పుకోవాలన్న తొందరనో, లేక బోగస్ ప్రకటనలతో ప్రజలని మభ్యపెట్టాలన్న ప్రయత్నమో, లేక అవగాహనరాహిత్యమో మొత్తానికి రేవంత్ తెచ్చానన్న పెట్టుబడుల్లో ఉన్న డొల్లతనాన్ని జనాలకి అర్థమయ్యే విధంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ ఎండగట్టారు. ఈ విమర్శలు మొత్తానికి కేంద్ర బిందువు రేవంత్ తమ్ముడు ఎనుముల జగదీష్ రెడ్డి స్వచ్ఛ్ బయో అని కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 15 రోజుల క్రితమే మొదలైన ఈ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో వెయ్యి కోట్ల రూపాయల ఒప్పందం ఎలా చేసుకుంది అని బీఆర్ఎస్ నిలదీసింది.

పైపెచ్చు స్వయానా సీఎం తమ్ముడికి సంబంధించిన కంపెనీతో ఒప్పందాలేంటి అని పలువురు మండిపడుతున్నారు. అది స్వచ్ఛ్ బయో కాదు.. అస్వచ్ఛ్ బయో అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది. ఈ దెబ్బకి కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు వరుసపెట్టి ప్రెస్ మీట్లు నిర్వహించారు. కానీ ఒక నాయకుడు చెప్పిన మాటలకి ఇంకో నాయకుడు చెప్పిన మాటలకి కొంచెం కూడా పొంతన లేదు. ఒకరు రేవంత్ తమ్ముడికి ఆ కంపెనీకి సంబంధం లేదని చెప్తే.. ఇంకొకరేమో రేవంత్ తమ్ముడి కంపెనీతో ఒప్పందం చేసుకుంటే తప్పేంటి అని వాదిస్తున్నారు. దీనిపై వితండవాదం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.. ఈ అంశాన్ని సరిగ్గా డిఫెండ్ చేసుకోలేక బీఆర్ఎస్ సోషల్ మీడియాని నిందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ నిస్సహాయత మరోసారి తేటతెల్లమైంది. ఈ అంశం ఇప్పుడు ప్రజల్లో నోళ్ళల్లో నానుతుంది. ప్రముఖ పత్రికలు కూడా సీఎం అమెరికా పర్యటన ఒక 'పీఆర్ డిజాస్టర్' అని వ్యాఖ్యానిస్తున్నాయంటే టూర్ ఎంత పెద్ద ఫ్లాపో స్పష్టమైతుంది. విదేశీ పర్యటనలకు వాడుకొని తనకంటూ ఒక పాజిటివ్ ఇమేజ్‌ని పెంచుకుందామని ఆశపడ్డ రేవంత్‌‌.. మొదటికే మోసాన్ని తెచ్చుకున్నాడు. పాజిటివ్ ఇమేజ్‌ సంగతి పక్కన పెడితే ఉన్న ఇమేజ్ కూడా మూసీ పాలయ్యింది. ఈ పర్యటన కొసమెరుపు ఏంటంటే.. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్టర్లతో కానీ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులతో కానీ సీఎం మాట్లాడిన ఒక్క వీడియో కూడా బయటకి విడుదల కాలేదు. దావోస్ పర్యటనలో బయటకి వచ్చిన సీఎం వీడియోలతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఫుట్‌బాల్ ఆడటంతో రేవంత్ నవ్వులపాలయ్యాడు. ఈసారి అలాంటి అవకాశం బీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వొద్దనే సీఎం రేవంత్ టీమ్ జాగ్రత్త పడిందని తెలుస్తోంది.
 

newsline-whatsapp-channel
Tags : telangana brs cm-revanth-reddy america social-media

Related Articles