నాణానికి మరోవైపు ఎంతోమంది ఆడవాళ్లు, కొందరు మగవాళ్లు కుటుంబ సభ్యుల, పక్కింటివాళ్ల లేదా అపరిచితుల చేతిలో చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనవారున్నారు. ఇది తగని స్పర్శ నుంచీ రోజుల తరబడి అత్యాచారానికి గురైనవాళ్లు.
న్యూస్ లైన్ డెస్క్: స్పర్శపై గత వరం రోజులుగా జరుగుతున్న దుమారం చూస్తున్నాను. కొన్ని ఆలోచనలు. పిల్లల శారీరక, మానసిక వికాసానికి కరచాలనం, కౌగిలింతలు, మర్దన, స్పర్శతో కూడిన ఆటలు కబడ్డీ వంటివి, కితకితలు, అభినందనతో కూడిన వీపు చరచటం ఇవన్నీ అవసరం, అవి తప్పు కాదు.
పిల్లలు కొన్నిసార్లు కొన్నిరకాల స్పర్శలని వద్దనుకుంటారు, దాన్ని తల తిప్పటం ద్వారా, చేత్తో తొయ్యటం ద్వారా లేదా వద్దని చెప్పటం ద్వారా తెలియజేస్తారు. దానిని గౌరవించాలి. కానీ అలా అని అది ఎప్పటికీ ఇష్టం కాదని కాదు, మళ్లీ ప్రయత్నించవచ్చు.
పిల్లలకి పళ్లు తోమటం, స్నానం చెయ్యటం, బట్టలు మార్చటం వంటివి వాళ్లు వద్దన్నా చేస్తాం, కానీ అవి చేసే ముందు నేనిది చేస్తున్నానని చెప్పటం, వాటిలో వారిని పాలుపంచుకునేలా చేయటం ఉదాహరణకు.. సబ్బు వాళ్లనే రాసుకోమనటం, బట్టలు ఎంచుకోమనడం ద్వారా వాళ్లకి ఆసక్తిని కలిగించవచ్చు. కొన్నిసార్లు బాగా చిరాకుగా ఉన్నప్పుడు బలవంతపెట్టకుండా ఒక రెండు నిమిషాలు ఆగి, వాళ్లు కుదుటపడ్డాక ప్రయత్నించవచ్చు.
పిల్లలకి ముందుగానే మూడేళ్ల వయసులో ఎక్కడెక్కడ ముట్టకూడని ప్రదేశాలో ఒక బొమ్మ ద్వారా చెప్పొచ్చు. పెదాలపై ముద్దు, ఛాతీ, పిరుదులు, తొడల లోపలిభాగం, జననేంద్రియాలు ముట్టడం నిషిద్ధం అని ముందుగానే చెప్పాలి. స్నానం చేసేటప్పుడు, శుభ్రపరిచేటప్పుడు, డాక్టర్ పరీక్షించేటప్పుడు తప్ప ఇంకెప్పుడూ యే సందర్భంలోనూ అక్కడ ముట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆటవిడుపుగా లేదా ఆటపట్టించటానికి అన్నట్లుగా తల్లిదండ్రులే కాదు, ఇంకెవరూ కూడా జననేంద్రియాలు ముట్టకూడదు.
అపరిచితుల (మీకు సుపరిచయం ఉన్నవాళ్లు పిల్లలకి అపరిచితులు కావచ్చు) ఒడిలో కూర్చోపెట్టడం, వాళ్లు బుగ్గలు గిల్లటం, భుజాలు పిసకటం వంటివి మంచివి కావు. ఏడాది దాటిన పిల్లలు సులువుగా అవి ఇష్టమో కాదో చెప్పగలరు. దానినిబట్టి మీరు వ్యవహరించాలి.
గుర్రంపండు ఎక్కించటం, ఛాతీమీద పడుకోబెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోపెట్టుకోవడం, చంకన ఎత్తుకోవడం, ప్రేమతో దగ్గరికి తీసుకుని కౌగిలించుకోవటం ఇలాంటివన్నీ పిల్లలతో మన బంధాన్ని బలపరిచి వాళ్లకి భద్రతాభావాన్ని, ప్రేమమీద నమ్మకాన్ని, అలాగే వాళ్లు అశాంతితో ఉన్నప్పుడు మన దగ్గర సాంత్వన దొరుకుతుందన్న భావనని కలుగజేస్తాయి.
ఇకపోతే, ఈ స్పర్శని మనం కచ్చితంగా గిరిగీసి ఇది మంచిది, ఇది కాదు అని చెప్పలేం, అది ఒక సంస్కృతి యొక్క కాలమాన పరిస్థితులని బట్టే కాకుండా, స్పర్శ వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకు.. పెద్దవాళ్లు ఆప్యాయతతో బుగ్గలు గిల్లటం, చెవులు లాగటం మనదేశంలో చాలా సాధారణ విషయం, కొందరు పిల్లలు వాటిని ఆస్వాదిస్తారు, కొందరు చిరాకు పడతారు. పిల్లల బట్టి నడుచుకోవాలి. అయితే కొందరు అసూయ, కామం, గెలిచేయటం వంటి ఉద్దేశ్యంతో పిల్లల్ని తాకుతూంటారు. దీన్ని తల్లిదండ్రులు వెంటనే గమనించి పిల్లల్ని దూరంగా జరిపి, వాళ్ల ముందే ఆ విధంగా ముట్టుకునే వాళ్లని వారించాలి. తద్వారా వాళ్లు మిగతా పిల్లలకి అలా చేయటం మానేస్తారు. రెండవది మీ పిల్లలకి నన్ను రక్షించటానికి మా అమ్మానాన్న ఉన్నారు, నాకు నచ్చకపోతే ఇలా ప్రశ్నించవచ్చు, అలాగే ఈ స్పర్శ దానివెనక ఉన్న ఉద్దేశ్యం అది ఎవరు చేసినా మంచిది కాదు అని తెలుసుకుంటారు. ఇక్కడ పిల్లలకి లింగభేదం లేదు అమ్మాయులైనా అబ్బాయిలైనా ఒకే నియమాలు.
మానసిక వైద్యుడిగా నేను ఎంతోమందికి వైద్యం చేయగా నేను గమనించిన కొన్ని విషయాలు, కొందరి ఆందోళన ఉన్న వ్యక్తులని వాళ్ళ బాల్యం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చినప్పటికీ వాళ్లకి ఇవ్వాల్సిన ప్రేమతో కూడిన స్పర్శ లేదా అభినందనలు ఇవ్వలేదు. కొందరిని వాళ్ల తల్లిదండ్రులు ఎప్పుడూ కౌగిలించుకోలేదు. ఇకపోతే నాణానికి మరోవైపు ఎంతోమంది ఆడవాళ్లు, కొందరు మగవాళ్లు కుటుంబ సభ్యుల, పక్కింటివాళ్ల లేదా అపరిచితుల చేతిలో చిన్నప్పుడు లైంగిక దాడికి గురైనవారున్నారు. ఇది తగని స్పర్శ నుంచీ రోజుల తరబడి అత్యాచారానికి గురైనవాళ్లు. వీళ్లు ఇటువంటి మానసిక గాయాల వలన మానవసంబంధాలపై పూర్తి నమ్మకాన్ని కోల్పోయి కొత్త మానవ సంబంధాన్ని ఏర్పరుచుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే, పైన చెప్పిన ఇరువురూ (చిన్నతనంలో ప్రేమ పూర్వక స్పర్శ పొందనివాళ్లు, లైంగికదాడికి గురైనవాళ్లు) కూడా సాన్నిహిత్యం ఏర్పరచటంలో ఇబ్బందులు ఎదుర్కున్నారు ముఖ్యంగా జీవిత భాగస్వామితో.
ఒక విషయం ఏమిటంటే ..పూర్తి ఆహ్లాదకరమైన ప్రేమపూర్వక వాతావరణంలో పెరిగిన కొంత మంది బాల్యంలో లైంగిక దాడికి గురైనవాళ్ల ఆందోళనని అర్థంచేసుకోలేరు, అది సహజం. ఇది అనవసర వాదనకి దారితీస్తోంది. దురదృష్టవశాత్తూ అందరి బాల్యం ఆనందదాయకం కాదు. ప్రమాదం ఎల్లవేళలా పొంచి ఉంటుంది. అది కుటుంబ సభ్యులు, చుట్టాలు, స్నేహితులు, తెలిసిన వాళ్లు, బడిలో పనిచేసే వాళ్లు, అపరిచితులు ఇలా ఎవరైనా. కాబట్టి పిల్లలని మనం రక్షించటమే కాకుండా వాళ్ళని వాళ్ళు హానికి దూరంగా ఉండే శిక్షణ ఇవ్వాలి.
పైన చెప్పిందంతా.. డాక్టర్ శ్రీకాంత్ మిర్యాల ట్విట్టర్ అకౌంట్ నుంచి సేకరించిన సమాచారం.