నిండుగా పారుతున్న గోదావరి.. ప్రాజెక్టుల్లో జలకళ ఏది?

గోదావరి నిండా పారుతుంది. 9 లక్షల క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులతో పరుగులు పెడుతుంది. కానీ.. గోదావరి మీదున్న ప్రాజెక్టులు నిండుతలేవు. గోదావరి పరిహాక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు. 


Published Jul 23, 2024 01:17:28 AM
postImages/2024-07-23/1721704411_IMG20240723082513640x400pixel.jpg

 

  • ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద.. 9 లక్షల 19 వేల క్యూసెక్కుల ప్రవాహం
  • ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకులగూడెం వద్ద.. 10 లక్షల క్యూసెక్కులతో నది ప్రవాహం
  • నడి వర్షాకాలంలోనూ అరకొర వరదతో.. ఎగువ, మధ్య గోదావరి ప్రాజెక్టులు 
  • శ్రీరాంసాగర్‌కు 20 వేల క్యూసెక్కులు
  • శ్రీపాద ఎల్లంపల్లికి 26 వేల క్యూసెక్కులు
  • సుందిళ్ల బ్యారేజ్‌కు 4 వేల క్యూసెక్కుల
  • అన్నారం బ్యారేజ్‌కు 15 వేల క్యూసెక్కులు
  • ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే ఎగువ మధ్య గోదావరి ప్రాజెక్టులు ఎండుడు ఖాయం..!

న్యూస్ లైన్ డెస్క్: గోదావరి నది పారుతుంది. 9 లక్షల క్యూసెక్కులు, 10 లక్షల క్యూసెక్కులతో పరుగులు పెడుతుంది. కానీ.. గోదావరి మీదున్న ప్రాజెక్టులు నిండుతలేవు. గోదావరి పరిహాక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు. కళ్ల ముందే ఏడాదికి సరిపడా నీళ్లన్నీ కిందికి పోతుంటే నిలుపుకోలేని పరిస్థితి తెలంగాణది. నీళ్లున్న దగ్గర ప్రాజెక్టులు లేవు. నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి. అందుకే ‘‘తలాపునా పారుతుంది గోదారి.. మన సేను మన సెలుక ఎడారి’’ అంటూ.. గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు, కళాకారులు పాటలు పాడిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిస్థితి రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకుంది. నేడు గోదావరి పారుతున్న వరద, అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు, బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహులార్థ సాధక ప్రాజెక్టు ప్రాముఖ్యతను చెబుతున్నాయి. 

గోదావరి నదిలో మనకు నీళ్లు ఉన్నాయి. కానీ అవి కింద ఉన్నాయి. వాటిని పైకి ఎత్తుకొచ్చుకోవాలి. తెలంగాణ భూభాగంలో పారుతున్న గోదావరిని రెండు భాగాలుగా చూడాలి. ఒకటి ఎగువ-మధ్య గోదావరి, రెండోది దిగువ గోదావరి. తెలంగాణలో గోదావరి ఎంటరైన కాన్నుంచి మేడిగడ్డ పైభాగం దాకా ఎగువ గోదావరి. మేడిగడ్డ నుంచి కింది భాగం మొత్తం దిగువ గోదావరి. అయితే ఎగువ గోదావరి మీదనే.. శ్రీరాం ప్రాజెక్టు కావొచ్చు, శ్రీపాద ఎల్లపంల్లి ప్రాజెక్టు కావొచ్చు, సుందిళ్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్‌లు ఉన్నాయి. వీటితో పాటు గోదావరి పరిహాక ప్రాంతంలోనే ఎక్కువగా రిజర్వాయర్లు, ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ వరద ప్రవాహం చాలా తక్కువగా ఉంది. మహారాష్ట్రలో అడుగడుగునా కట్టిన ప్రాజెక్టుల కారణంగా దిగువకు వచ్చే వరద ప్రవాహంపై ప్రభావం పడుతోంది. పైనే నీళ్లను అడ్డుకుంటూ తమ అవసరాలకు వాడుకుంటోంది మహా సర్కార్. ఈ నేపథ్యంలో ఎగువ, మధ్య గోదావరిలో నీళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి. వానాకాలం పోతే ఇక అక్కడ నీళ్లు ఉండటం చాలా కష్టం. నీళ్లో రామచంద్ర అన్న పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి. 

అయితే దిగువ గోదావరిలో మనకు ఈ పరిస్థితి ఉండదు. నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది ఇక్కడే. ఏడాది పొడవునా నీళ్లకు ఇబ్బందిలేని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. పైనుంచి వచ్చే ప్రాణహిత, ఇంద్రావతి గోదావరిలో కలవడంతో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. దట్టమైన అరణ్యం నుంచి ప్రవహించే ప్రాణహిత, ఇంద్రావతిలను సక్రమంగా వినియోగించుకుంటే ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నది అసలు వాస్తవం. వానాకాలంలో అయితే ఈ ఫ్లో మరింత ఎక్కువగా ఉంటుంది. తాజా లెక్కల ప్రకారం(జూలై 22, సోమవారం) ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద ప్రస్తుతం వరద ప్రవాహం 9 లక్షల 19వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాగులగూడెం దగ్గర 10 లక్షల క్యూసెక్కులు. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉన్నది. అయితే ఇది ఒక్క వరద జలాల్లోనే గాక, నికర జలాల్లో కూడా కనిపిస్తోంది. అందుకే 75 శాతం డిఫెండబుల్‌తో మేడిగడ్డ దగ్గర అలాగే దాని కింద మాత్రమే నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. రేపటి రోజున తెలంగాణకు ప్రాణాధారమైనవి ఈ నీళ్లే. గోదారి ఎండిపోకుండా సజీవంగా నిలిపేవి ప్రాణహిత, ఇంద్రావతి మాత్రమే.

తాజా వరద నీటి ప్రవాహం లెక్కలే దీనికి నిదర్శనం. జూలై 22 సోమవారం నాడు సింగూరు ప్రాజెక్టు దగ్గర ఇన్ ఫ్లో 1270 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 391 క్యూసెక్స్, ఇక నిజాం సాగర్‌లో 600 క్యూసెక్స్ ఇన్ ఫ్లో ఉంది. అలాగే శ్రీరామ్ సాగర్‌లో 20వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో కాగా, ఔట్ ఫ్లో 518 క్యూసెక్స్, అలాగే నారాయణ రెడ్డి ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 4787 క్యూసెక్స్, ఔట్ ఫ్లో 3328 క్యూసెక్స్. ఇక శ్రీపాద ఎల్లంపల్లిలో 26వేల క్యూసెక్స్ కాగా, ఔట్ ఫ్లో 331 క్యూసెక్స్, లక్ష్మీ బ్యారేజ్(మేడిగడ్డ)లో 9లక్షల 19వేల క్యూసెక్స్ కాగా , ఔట్ ఫ్లో 9 లక్షల 19వేల క్యూసెక్స్, ఇక తుపాకులగూడెం దగ్గర 10లక్షలకు పైన ఇన్ ఫ్లో ఉంటే, అంతే స్థాయిలో ఔట్ ఫ్లో ఉంది. సీతారామ సాగర్‌లోనూ 11 లక్షల క్యూసెక్స్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఉంది. భద్రాచలంలో 9 లక్షల 73వేల క్యూసెక్స్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో ఉంది. మేడిగడ్డ, తుపాకులగూడెం, సీతారామ, భద్రాచలం దగ్గర వచ్చిన నీటిని వచ్చినట్టే పంపేస్తున్నారు. అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటానికి గల కారణం గోదావరికి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి. ఇక్కడ నికర జలాలను లెక్కగట్టి వినియోగించుకుంటే భవిష్యత్ తెలంగాణకు అపారమైన జలవనరులను సాధించుకున్నట్టేనని పలువురు ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : kcr india-people ts-news revanth-reddy latest-news news-updates kaleshwaram-projcet

Related Articles