ఎమ్మెల్యేలకు బుజ్జగింపు
ఏ సమస్య ఉన్నా.. నా దగ్గరకు రండి
నిధులిస్తా.. అన్నీ చేస్తా!
స్థానిక సంస్థల్లో గెలుపు బాధ్యత మీదే
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సీఎల్పీలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసిన సీఎం
కొత్త, పాత నేతలు సమన్వయంతో పని చేయాలి: పీసీసీ చీఫ్
స్పెషల్ ఎట్రాక్షన్‌గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
పలు డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు
రెవెన్యూ మంత్రిపై ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం
సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం
పేరుకే సీఎల్పీ మీటింగ్ అయినా ఎమ్మెల్యేల బుజ్జగింపే లక్ష్యంగా సమావేశం జరిగిందని సమాచారం. మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవాలని, పార్టీ కోసం అందరూ నిలబడాలని, నియోజకవర్గాలకు ఏం కావాలన్నా చేస్తానని చెప్పినట్టుగా సమాచారం. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేతిలోని ఫైళ్లు చర్చనీయాంశంగా మారాయి. ఎవరి చిట్టా అందులో ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరిగింది.
తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 06): ఎమ్మెల్యేలు ఏమైనా సమస్యలుంటే తన వద్దకు వచ్చి నేరుగా చెప్పుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారికి కావలసినవి ఏంటో తెలుసుకుని, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం ఉండదని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఎపిసోడ్‌తో పార్టీకి డ్యామేజ్ జరగడంతో.. ఎమ్మెల్యేలతో కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తుంది. మంత్రుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తను చూసుకుంటానని హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. నగరంలోని ఎంసీహెచ్ఆర్‌డీలో గురువారం జరిగిన సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యలతో పలు అంశాలను ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి సీఎం అధ్యక్షత వహించగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని గట్టెక్కించే బాధ్యతను ఎమ్మెల్యేలపై పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రజావ్యతిరేకత నుంచి బయటపడేందుకు శతవిధాల సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ప్రతి అంశానికి ఎమ్మెల్యేలను ముడిపెడుతూ.. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఆలయాలు, నిర్మాణ అనుమతులకు, నిధుల మంజూరు కోసం మంత్రులను ఎమ్మెల్యేలు కలవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను, గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలపై ప్రతిపక్షాలు లేని పోని అపోహలు సృష్టిస్తున్నాయని, అదే స్థాయిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణను వివరించేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ మేరకు సమావేశంలో నిర్ణయించారని తెలుస్తుంది. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చ జరిగింది.
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం: పీసీసీ చీఫ్
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన చేపట్టామని... రాహుల్ గాంధీ ఆశయం మేరకు పరిపూర్ణంగా సర్వే చేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చామని అన్నారు. చాలా అంశాలపై సీఎల్పీ సమావేశం జరిగిందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నామని.. ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ సమావేశం ద్వారా ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతలు సమన్వయంతో సాగితేనే స్థానిక సంస్థల్లో పాగా వేయగలమని సూచించారు. కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీ కులగణన చేపట్టామని, ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతా చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఉత్తర తెలంగాణలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని అన్నారు. బీసీ కులగణను శాస్త్రీయంగా చేపట్టామని, దీనిపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గాల స్థాయిలోనే కౌంటర్ అటాక్ చేయాలని సూచించారన్నారు. అదే విధంగా ఎస్సీ వర్గకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, చెప్పామని, దానిని అమలు చేసి చూపామని అన్నారు.
ఫైళ్లతో వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే
రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .. సీఎల్పీ సమావేశంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. సీఎల్పీ సమావేశానికి కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని రావడం చర్చనీయాంశమైంది. ఆయన పదే పదే రెవెన్యూ మంత్రి పొంగులేటి అంశాన్ని ప్రస్తావిస్తుండడంతో.. ఆ డాక్యుమెంట్లలో ఏం ఉందా అన్న చర్చ జరిగింది. ఆయన సీఎం రేవంత్, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షికి పలు డాక్యుమెంట్లు అందించారని, సదరు మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తుంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరం
ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, గూడెం మహిపాల్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, సంజయ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరు కాలేదు. అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం, కేసు సుప్రీంకోర్టులో ఉండటం.. టెక్నికల్ గా ఏ సమస్యా రాకుండా ముందు జాగ్రత్త చర్యలగా వీరు గైర్హాజరైనట్టు సమాచారం.