నేడు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ
మధ్యాహ్నం ఎంసీహెచ్ఆర్‌డీలో సమావేశం
హాజరుకానున్న డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ దీపాదాస్
సర్వత్రా ఆసక్తిరేపుతున్న మీటింగ్
జడ్చర్ల ఎమ్మెల్యేపైనే అందరి ఫోకస్
సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులు, మంత్రుల వర్సెస్ ఎమ్మెల్యేలుగా వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పథకాలు తదితర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. అయితే, ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపైనే అందరి దృష్టి పడింది. తమ అసంతృప్తిని యువ ఎమ్మెల్యేలు ఇన్ ఛార్జ్ ముందు వెళ్లగక్కే అవకాశం ఉందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణం, హైదరాబాద్(ఫిబ్రవరి 05): ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.
నాలుగు గ్రూపులుగా ఎమ్మెల్యేలు
మొత్తం ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపుతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్టుగా సమాచారం. పార్టీలో, ప్రభుత్వంలో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి రహస్యంగా సమావేశమైన ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసినట్టుగా సమాచారం. పార్టీలో, బయట జరుగుతున్న చర్చకు దీని ద్వారా ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో హైకమాండ్ ఉందని సమాచారం. ఎమ్మెల్యేలందరితో సమావేశమై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ, ప్రభుత్వం పరంగా వారికున్న ఉన్న సమస్యలు చర్చించాలనే అభిప్రాయానికి హస్తం పార్టీ పెద్దలు వచ్చారన్న టాక్ వినిపిస్తోంది.