వింటేజ్ కేసీఆర్!


Published Feb 03, 2025 02:06:05 PM
postImages/2025-02-03/1738571765_WhatsAppImage20250203at2.04.28PM.jpeg

వింటేజ్ కేసీఆర్!

 

పిడికిలి బిగించిన గులాబీ బాస్

ఉద్యమ పంథాలో సర్కారుపై పోరుకు సిద్ధం

నాటి ఉద్యమ నాయకుడిని చూస్తున్న కేడర్

మలిదశ ఉద్యమంలో కేసీఆర్ మాటల తూటాలు

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై..

ఉమ్మడి పాలకులను నిలదీసిన నాయకత్వం

ప్రస్తుతం అదే జోష్‌లో కనపడుతున్న కేసీఆర్

14 నెలల కాంగ్రెస్ పాలనపై పోరుబాట పట్టాలని పిలుపు

తెలంగాణ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి..

పోరాడాలంటున్న బీఆర్ఎస్ అధినేత

ఉద్యమ రోజులను తలుచుకుంటున్న జనం

 

 

కేసీఆర్ అంటే బస్తీమే సవాల్ అన్నట్టుగా మాట్లాడే వాగ్ధాటి గుర్తొస్తుంది. యుద్ధంలో అలసిపోని యోధుడు గుర్తుకు వస్తాడు. లక్షలాది మందిని ఒకేబాటలో నడిపించిన ఉద్యమ సారథి కళ్లముందు కదలాడతాడు. తెగించి కొట్లాడే స్వభావం ఆయనది. పడికిలి బిగించి ఔర్ ఏక్ ధక్కా మార్ అనే వ్యవహారం ఆయనది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనో ఫైటర్. బలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎదుర్కొన్న బక్కపలచని మనిషి..కేసీఆర్. ఆయన మాటల్లో చెప్పాలంటే.. ‘‘దుమ్ము.. దుమ్ము రేగే వరకు కొట్లాడతా. కొట్లాడే అలవాటుంది నాకు. నా బతుకే ఓ కొట్లాట. నేనో ఫైటర్’’. ఇది ఆయన లక్షణం. ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడిన విధానం ఆ వింటేజ్ కేసీఆర్‌ను జ్ఞాపకం చేస్తోంది. ఆయనలోని ఫైటర్ ని మరోసారి అందరికీ గుర్తుచేశారు. బీఆర్ఎస్ శ్రేణులు కోరుకుంటున్న కేసీఆర్ మళ్లీ వచ్చాడు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ఈ నెలాఖరులో పెట్టబోయే భారీ బహిరంగ సభ ఎలా ఉండబోతోందో అన్న ఆసక్తి కూడా యావత్ తెలంగాణ ప్రజల్లో నెలకొంది.

 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 02) :

 

మళ్లీ పాత కేసీఆర్‌ గుర్తొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కేడరే కాదు, చాలా మంది నోట వింటున్న మాట ఇది. ఎర్రవల్లి నివాసంలో శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడిన శైలి, ప్రభుత్వంపై విమర్శలు, ప్రజలను సున్నితంగా హెచ్చరించడం తదితర అంశాలు నాటి కేసీఆర్‌ను జ్ఞాపకం చేశాయి. దోపిడీకి గురైన, అవమానాలకు గురైన తెలంగాణ సమాజాన్ని ఉద్యమ సమయంలో ఎలా చైతన్య పరిచారో అందరికీ తెలిసిందే. నాటి అధికార కాంగ్రెస్ పార్టీ కుయుక్తులను ఎదుర్కొంటూ, చక్కని వ్యూహ రచనతో రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమనాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన మాటలు, రచించిన వ్యూహాలు, రాష్ట్రంపై ఎంతో మందికి నాడు ఆశలు కల్పించి, ఉద్యమ బావుటాను చేతబట్టేలా చేశాయి. ఆ బాటలో నడిచేలా చేశాయి.

 

రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా ఆయన ఆ ఉద్యమ స్ఫూర్తినే కనబరిచారన్నది విశ్లేషకుల మాట. వ్యవసాయం, విద్యుత్, ఉద్యోగాలు, పాలన.. ఈ నాలుగు అంశాలపై ఆయన సారథ్యంలో సాధించిన విజయాలు తిరుగులేనివనడానికి నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులే నిదర్శనమని అంటారు. పథకాల రూపకల్పనలోనూ కేసీఆర్ ది అందె వేసిన చెయ్యి. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు ఇలా ఏది తీసుకున్నా ఆయన శైలే వేరు. అట్టడుగున ఉన్న పేదలను ఆత్మగౌరవంతో నిలబెట్టాలనే తపన అందులో కనిపిస్తుంది. 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి నాటి ఉమ్మడి పాలకులు చేసిన అవహేళనలను తప్పు అని నిరూపించారు. ఆత్మగౌరవ తెలంగాణ నుంచి స్వయం పోషక తెలంగాణగా తీర్చిదిద్దారు. పరాయి పాలనలో గోసపడ్డ, దగాపడ్డ తెలంగాణను గెలిపించిన పాలకుడిగా ఆయన్ను ప్రజలు చూస్తుంటారు. మనం మోసపోతే మళ్లీ గోసపడతామంటూ ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉండేవారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వేరుగా వచ్చాయి. అనంతరం ఆయన మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన ప్రజలకు దూరమయ్యారన్న చర్చ జరిగింది. ఎర్రవల్లికే పరిమితమయ్యారని పలువురు విమర్శలు గుప్పించారు.

 

కానీఆ మౌనం పటాపంచలైంది. మునుపటి కేసీఆర్‌ను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ అఘాయిత్యాలను కళ్లకుగట్టేలా వివరించారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతూ, కాంగ్రెస్‌ సర్కార్‌పై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రక్షకులుగా ప్రాణాలకు తెగించి పోరాడాలని శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఒక్క రైతుబంధే కాదని, అన్నీపోయి గంగల కలిసినయ్‌ అని కేసీఆర్ వాపోయారు. కరెంట్‌ కథ మళ్లీ మొదటికి వచ్చింది, మార్చి, ఏప్రిల్‌లో ఏం జరుగుతదో తెలియకుండా ఉన్నదన్నారు. కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా ఇస్తలేరన్నారు. ఇదేందని అడిగే నాథుడు లేడని, ఎవరన్న గట్టిగ నిలదీస్తే పోలీసులకు పట్టిస్తున్నారన్నారు. ఇదేనా రాజ్యం ? ఇట్లనే ఉంటదా రాజ్యం? అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఎందుకు మీకని కాంగ్రెస్ నేతలను నిలదీశారు. పది మందికి మేలు చేయడానికా? లేక తమాషా చేయడానికా? అని ప్రశ్నించారు. ఓపిక పట్టేకాడికి పట్టినమని, ఇప్పటికి 14 నెలలైందని, ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వం మెడలు వంచేందుకు ప్రత్యక్ష పోరాటాల కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ తెలివితక్కువతనానికి కాగ్‌ నివేదికే నిదర్శనమని, ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాన్ని క్షమించమని హెచ్చరించారు. వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, కాంగ్రెస్‌ సర్వేనే సాక్ష్యమన్నారు. కాంగ్రెసోళ్లు వస్తే ఏదో చేస్తరని ప్రజలు ఆశపడ్డారని, ఇప్పుడు గోసపడుతున్నరంటూ నాటి తన మాటలను గుర్తు చేశారు. ఈ నెలాఖరులో బీఆర్‌ఎస్‌ భారీ సభ ఉంటుందని ప్రకటించి, అందరిలో జోష్ నింపారు.

 

కేసీఆర్ మాట్లాడిన తీరు ఆద్యంతం ఒకనాటి ఉద్యమనాయకుడిని తలపించిందన్న చర్చ జరుగుతోంది. నాడు ఏవిధంగా అయితే పోరాట పటిమను చూపేవారో నేడు అదే స్థాయిలో ఆయన మాటలు ఉన్నాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ, తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విధానాన్ని వివరించారు. రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారని, రాష్ట్ర రైతాంగాన్ని ముంచుతారని నాడే తాను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూనే, మరోపోరాటానికి వారందరినీ సిద్ధం కావాలని పిలుపునివ్వడం వింటేజ్ కేసీఆర్‌లోని పోరాట లక్షణాన్ని మరోసారి కళ్లముందు ఉంచిందన్న అభిప్రాయం అందరిలో కలుగుతుంది.

newsline-whatsapp-channel
Tags : kcr brs ktr telanganam

Related Articles