పాలమూరును ఎండబెడుతున్న సర్కార్
జాతీయ హోదా అసాధ్యమన్న కేంద్రం
సరైన అంచనాలు, సాంకేతిక అంశాలతో
రిపోర్ట్ లేకుండా ఇవ్వలేం!
కృష్ణ జలాలల్లో కేటాయింపులు తేలాలి!
ఇప్పుడు హోదా ఇవ్వలేమని తేల్చిన మోడీ సర్కార్
రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరే కారణమన్న విమర్శలు
14 నెలలుగా కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టిన సర్కార్: ఎమ్మెల్సీ కవిత
నాడు ముందు చూపుతో కేసీఆర్ వ్యవహరించారు
నేడు ప్రభుత్వం అలసత్వమే పాలమూరుకు శాపం
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఒకపక్క కాళేశ్వరాన్ని పడావు పెడుతున్న సర్కార్ మరోపక్క నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడంలోనూ విఫలమవుతోంది. పదేపదే తనను పాలమూరు బిడ్డగా చెప్పకునే సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాకు తనే అన్యాయం చేస్తున్నారన్న విమర్శలను మూటగట్టుకుంటున్నారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు దాహార్తిని, పంటలకు సాగునీటిని అందించే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్రం ప్రకటించడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. సరైన అంచనాలను, సాంకేతిక అంశాలను కేంద్రానికి అందించకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే నేటి పరిస్థితికి కారణమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 06): పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం అసాధ్యమని కేంద్రం ప్రకటించింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా.. జాతీయ హోదా సాధ్యం కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్ధలు కొట్టింది. కృష్ణ జలాల్లో వాటాలు తేలే వరకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద 2015 జూన్ 11న నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పలుమార్లు జాతీయ హోదా కోసం కేంద్రాన్ని సంప్రదించి, విజ్ఙప్తి చేసింది. అయితే సర్కార్ మారడంతో పనుల్లోనూ నత్తనడకమొదలైంది. ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరుగుతూపోతోంది. అయితే ఈ క్రమంలో రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక ప్రకటన చేసింది.
రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచకపోవడంతోనే ఆలస్యం అవుతోందన్న విమర్శలు ఉన్నాయి. కేవలం సమావేశాలతో సరిపెట్టేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా, కేవలం సాగు నీరందించేందుకు కాల్వల పనులను మాత్రమే తవ్వాల్సి ఉంది. జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరందడంతోపాటు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని 910 హాబిటేషన్లకు తాగు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే ప్రభుత్వం మారాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని స్థానికులు అంటున్నారు. జాతీయ హోదా సాధించడానికి కేంద్రం ముందు బలమైన వాదనలు వినిపించడంలో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ విఫలమైందని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్న ఆవేదన పాలమూరు బిడ్డల్లో కనపడుతోంది.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం - పాలమూరుకు శాపం!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం పాలమూరుకు శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. 14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన రేవంత్ సర్కార్.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసిందన్నారు. కేసీఆర్ హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులను న్యాయవివాదాల సుడి నుంచి బయటకు తేలేకపోయిందన్నారు. ఎంతో ముందుచూపుతో కేసీఆర్ పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాన్ని కేంద్రానికి సరిగ్గా చెప్పలేక తుది అనుమతులను మరింత సంక్లిష్టం చేసిందని మండిపడ్డారు. దీంతో కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చిచెప్పిందని వాపోయారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఆయన చిత్తశుద్ధి ఏపాటిదో ఈ రోజు తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టు లక్ష్యాలు (బాక్స్)
జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తి పోయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్.సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి ల నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు.