రేవంత్ కి ఎమ్మెల్యేల భయం!


Published Feb 06, 2025 12:56:56 PM
postImages/2025-02-06/1738826816_revanthreddy.jpg

రేవంత్ కి ఎమ్మెల్యేల భయం!

సపరేట్ మీటింగ్స్ అందుకేనా?

 

అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకా?

ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు

ఎమ్మెల్యేల మెడపై వేలాడుతున్న అనర్హత కత్తి

సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత

ఎమ్మెల్యేలు చేజారతారేమోనన్న ఆందోళన

ప్రతిపక్షం వ్యూహంపైనా లోలోన భయం

వరుస రాజకీయ పరిణామాలతో గుబులుగుబులుగా సీఎం

 

 

 ఏడాది తర్వాత పార్టీలో తనకు తిరుగులేదనుకుంటే యువ ఎమ్మెల్యే సైతం ధిక్కార స్వరం వినిపించే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేలు ఎగరేసిన తిరుగుబాటు జెండా సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేసింది. ఎప్పుడు ఏమవుతుందనే టెన్షన్ ఆయన్ను పట్టుకుంది. ఒకపక్క సొంతపార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ.. మరోపక్క సుప్రీం కోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ.. ఇంకోపక్క ప్రజావ్యతిరేకత కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని, పార్టీలో తన పరపతిని తగ్గిస్తున్నాయన్న ఆందోళన సీఎంలో నెలకొందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారని, వారిని బుజ్జగించి, మళ్లీ దారిలోకి తెచ్చుకుంటేనే తన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండదన్న ఆలోచనల్లో సీఎం రేవంత్ ఉన్నట్టు తెలుస్తుంది.  

 

తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 05): ఎమ్మెల్యేల రహస్య భేటీ‌తో ఒక్కసారిగా షాక్ తిన్న సీఎం రేవంత్ రెడ్డి దిద్దిబాటు చర్యలకు దిగినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన పదవికే ఎసరు తెచ్చేలా ఉన్న తాజా రాజకీయపరిణామాలతో అలర్ట్ అయిన ఆయన.. వెంటనే ఎమ్మెల్యేలతో చర్చించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతర్గత పోరును కట్టడి చేయకపోతే తనకు ఇబ్బందులు తప్పవన్న టెన్షన్‌తో ఎమ్మెల్యేలతో ఎంసీహెచ్ఆర్డీలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని సమాచారం. ముఖ్యంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.

 

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలు సమావేశం అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్‌గా ఈ సమావేశం జరిగిందన్న చర్చ అప్పుడు జరిగింది. కొన్ని నియోజకవర్గాలకు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయన్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారని, మంత్రి పొంగులేటి వ్యవహార శైలి కూడా వారిలో అసంతృప్తికి కారణమన్న ప్రచారం నాడు జరిగింది. డైరెక్టుగా పార్టీ హైకమాండ్‌‌తో మాట్లాడతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. తాజా భేటీలో గ్రూపుల వారీగా ఎమ్మెల్యేలతో చర్చించి, వారి నుంచి సమాచారం సేకరించి, వారికి భరోసా కల్పించాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వారితో చర్చించకపోతే పార్టీలోని వర్గపోరు మరింత ముదిరే అవకాశముందన్న ఆందోళనలో రేవంత్ ఉన్నారన్న ప్రచారం జరుగోతంది. ఇప్పటికే ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి తోడు ఎమ్మెల్యేలలో వ్యతిరేకత నెలకొంటే మొదటికే మోసం వస్తుందన్న టెన్షన్‌లో రేవంత్ ఉన్నారని సమాచారం. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ఈ సమావేశం నిర్వహిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

ఇక, సుప్రీం కోర్టులో ఈ నెల 10న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ జరగనుంది. అక్కడ వచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వ్యతిరేకంగా తీర్పు వస్తే రేవంత్ సర్కార్ ఇబ్బందులు తప్పవు. ఆ 10 స్థానాల్లో మళ్లీ సభ్యులను గెలిపించుకోవడం కత్తిమీద సాములాంటిదే. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకాక జనాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఉపఎన్నికలకు వెళ్లడం అంత ఈజీ కాదన్న ఆందోళన సీఎం రేవంత్‌లో నెలకొందన్నది రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈ టెన్షన్ ఇలా ఉంటే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్‌ను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన జనంలోకి వస్తే.. ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడుతుందని, జనంలో వ్యతిరేకత పెరిగే ఛాన్సులు ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకుందామనే సెంటిమెంట్‌ను రంగరించి, వారిలో ఆ భావన కల్పించి.. పార్టీపై తన పట్టు కోల్పోకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తపడుతున్నారన్న చర్చ జరుగుతుంది.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy mla congress telanganam

Related Articles