ఇంకా జీతాలు పడలే !


Published Feb 04, 2025 01:54:10 PM
postImages/2025-02-04/1738657450_WhatsAppImage20250204at1.27.36PM.jpeg

ఇంకా జీతాలు పడలే ! 

ఫస్ట్ తారీఖున జీతాలనేది ఉత్త కథేనా ?

నాలుగో తారీఖు వచ్చినా నో సాలరీస్

చిన్నస్థాయి ఉద్యోగులకే వేసి, పెద్దలకు ఆపేసిన వైనం

విద్యుత్ శాఖలో కిందిస్థాయి ఉద్యోగులకే శాలరీలు!

డీఏలపైనా ప్రభుత్వం మడతపేచీ

ఇన్‌స్టాల్ మెంట్లలో చెల్లిస్తున్న ప్రభుత్వం

 

ఉద్యోగులందరికీ ఒకటో తారీఖునే జీతాలనేది ఉత్తముచ్చటే అయ్యింది. రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పుకోవడమే కానీ, చేసేది ఏం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సైతం జీతాలు రాక తిప్పలు పడుతున్నారు. క్రమం తప్పకుండా అందరికీ జీతాలు చెల్లిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గప్పాలు కొడుతున్నారని, కానీ వాస్తవం వేరని పలువురు మండిపడుతున్నారు. చాలా శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు ఇస్తే.. పైస్థాయిలో ఉన్నవారికి జీతాలు ఆపేశారట. అంతేగాక కరువు భత్యం చెల్లింపులోనూ తాత్సారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

తెలంగాణం, స్టేట్ బ్యూరో(ఫిబ్రవరి 03) :

 

రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ తారీఖున జీతాలు వేస్తున్నామంటూ చెప్పే సర్కార్.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో జీతాలు వెయ్యకపోవడం గమనార్హం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చెప్పేది ఒకటి కాగా.. ఆచరణలో కనిపించేది వేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ శాఖలో ఉన్నతస్థాయి అధికారులకు జీతాలు రాలేదని సమాచారం. కింది స్థాయి ఉద్యోగులకు వేసి.. పైస్థాయిలో ఉన్నవారికి హోల్డ్‌లో పెట్టిందని తెలుస్తుంది. ఇదే పరిస్థితి పలు డిపార్ట్‌మెంట్స్‌లో ఉందన్న టాక్ వినపడుతోంది.

 

ఇక కరువుభత్యం విషయంలోనూ ప్రభుత్వం తీరుపై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. డీఏలపై సర్కార్ మడతపేచీ పెడుతోందని అంటున్నారు. ఒక్క

ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్‌ను తీసుకుంటే డీఏలను ఆరు నెలల పాటు ఇన్ స్టాల్ మెంట్లలో ఇస్తున్నారని తెలిసింది. ఇక పోలీస్, విద్యాశాఖలలోనూ 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయట. ఒక డీఏ చెల్లించి చేతులు దులిపేసుకుంది సర్కార్. చాలా మంది ఈ డీఏల కోసం ఎదురు చూస్తున్నారు. తమకు డీఏలు వస్తే.. ఏ అవసరమైనా తీరుతుందనే ఆలోచనల్లో చిన్నస్థాయి ఉద్యోగులు ఉన్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచన లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.  

 

ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. సమయానికి జీతాలు రాక, ప్రతి నెలా అప్పులు చేయాల్సి వస్తుందని, వడ్డీల భారం పెరిగిపోతున్నదని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. అత్యవసర సమయంలో పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. చిన్నచితకా జీతాలు తీసుకునే తమపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించాలని అంటున్నారు

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress telanganam

Related Articles