ప్రజాతీర్పు
కేసీఆర్ పాలనే బాగుంది (టైటిల్)
రేవంత్ పాలన బాలేదన్న పబ్లిక్
పాలనపై అధికారిక హ్యాండిల్లో కాంగ్రెస్ సర్వే
ఫామ్ హౌస్ పాలనా..? ప్రజల వద్దకు పాలనా ? అని పోల్
ఫామ్ హౌస్ పాలనకు 67 శాతం మంది ఓటు
ప్రజల వద్ద పాలనకు కేవలం 33 శాతం మాత్రమే
హాస్తం పార్టీపై ప్రజల్లో అసంతృప్తి
ప్రజాతీర్పుపై కాంగ్రెస్ పార్టీలో చర్చ
క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆందోళనలో పెద్దలు
ఏడాది పాలనపై సోషల్ మీడియాలోనే కాదు..
గ్రామ సభలలోనూ పాలనపై క్లారిటీ
ప్రజల తిరుగుబాటే దానికి నిదర్శనమన్న వాదన
కాంగ్రెస్ కు జ్ఞానోదయం అయ్యింది: ఆర్ఎస్పీ
ఇప్పటికైన జనం నాడి తెలుసుకోవాలని సూచన
మా సోషల్ మీడియా వీక్‌గా ఉందన్న పీసీసీ చీఫ్
ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌పై అభిమానం ఉంటుందని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. తాను తీసిన గోతిలో తానే పడ్డట్టుగా ఉంది దాని పరిస్థితి. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజలకు వద్దకు పాలన కావాలా అంటూ ఆ పార్టీ చేసిన సర్వేలో జనం ఊహించని షాకిచ్చారు. ప్రజల వద్దకు పాలన వద్దంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారికి హ్యాండిల్లో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం. ఏ కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే ఫామ్ హౌస్ పాలన అంటూ అవహేళన చేశారో ఆ పాలనకే ప్రజలు పట్టం కట్టడంతో హస్తం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. అమలు గాని హామీలు, ఆరు గ్యారంటీలు.. జనంలో రేవంత్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని, అందుకే కేసీఆర్ పాలనకు జైకొట్టారని విశ్లేషకులు అంటున్నారు.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(జనవరి 30): ‘ఇందిరమ్మ ప్రజా పాలన’ అంటూ మురిసిపోయే కాంగ్రెస్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ‘ఎక్స్’ అధికారిక హ్యాండిల్లో ఆ పార్టీ స్వయంగా నిర్వహించుకున్న సర్వే.. క్యాడర్‌ను తీవ్ర నిరుత్సాహనికి గురిచేసే ఫలితాలు వచ్చాయి. కేవలం కేడర్‌ను మాత్రమే కాదు, టాప్ లీడర్లను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఫలితాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఆప్షన్ ఏ .. ఫామ్ హౌస్ పాలన, ఆప్షన్ బి.. ప్రజల వద్దకు పాలన అంటూ బుధవారం ఆ పార్టీ పెట్టిన పోల్‌లో 92,551 మంది పాల్గొన్నారు. ఇందులో 67 శాతం మంది ఫామ్ హౌస్ పాలనకే మొగ్గు చూపగా, 33 శాతం మాత్రమే ప్రజల వద్దకు పాలన కోరుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఈ పోల్ మొదలవ్వగా.. ప్రారంభం నుంచే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. నిత్యం ఫామ్ హౌస్ పాలన అంటూ కేసీఆర్ గవర్నమెంట్‌పై విమర్శలు చేసే కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రజల వద్దకు పాలన వద్దంటూ ఫామ్ హౌస్ పాలన ముద్దంటూ ఓటింగ్ చేయడంతో, నకిలీ అకౌంట్స్ నుంచి ఓటు వేశారు.. 20 నిమిషాలలో 20వేల ఓట్లు వేయించారంటూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. అంతేకాని, తన ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధమవ్వలేకపోయిందన్న చర్చ జరుగుతోంది. అంతేగాక కామెంట్స్‌కు లాక్ చేయడం విశేషం.
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుందన్న చర్చ జరుగుతోంది. ప్రజల్లో అసంతృప్తిని గమనించకుండా ప్రతిపక్షంపై బుదరజల్లే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. రైతులు, నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి దృష్టి పెట్టకుండా కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలోనే కాలం వెల్లదీస్తుంది. కాంగ్రెస్‌కు ఎదురైన ఈ ఓటమి సోషల్ మీడియాలో చాలా కామన్ అనుకోవడానికి లేదని, ఆ పార్టీ తీవ్రంగా ఆలోచించాల్సిన సమయమని చెబుతున్నారు. గ్రామసభల్లో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యిందని, దాన్ని నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. 100 రోజుల్లో చేస్తామన్న రుణమాఫీ చేయకపోగా, రైతుభరోసా ఇవ్వకుండా, మహిళలకు రూ. 2500పై స్పందించకుండా, పెన్షన్లు పెంచకుండా, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ వేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్‌కు ఇది భారీ ఎదురుదెబ్బ అంటున్నారు. హామీల అమలును ఆలస్యం చేస్తున్న రేవంత్ సర్కార్.. సమీక్ష చేసుకోవలాలని చెబుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతూ, నానా విధాల భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ తన పంథాపై పునరాలోచించుకోవాలని అంటున్నారు.
పోల్‌పై సర్వత్రా చర్చ
కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్‌పై ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏకంగా ఓ మీడియా దీనిపై చర్చ జరగగా, వారు ఆన్ లైన్లో దీనిపై సర్వే చేయగా అక్కడ కూడా ఫామ్ హౌస్ పాలన వైపే మొగ్గు చూపడం విశేషం. నిజంగానే మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అని పోల్ నిర్వహించగా 79శాతం మంది యస్ అని, 21శాతం నో అని చెప్పారు. ఇలా ఏవిధంగా చూసినా, కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ ఆందోళనకు గురవుతుందట.
వాళ్లకు జ్ఞానోదయం అయ్యింది: ఆర్ఎస్పీ
మరోవైపు మోసం చేస్తున్న కాంగ్రెస్‌పై ఇది తాము సాధించిన విజయమని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. రేవంత్ సర్కార్ ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న విషయం ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ నిర్వహించిన పోల్‌లో వెల్లడైనందునా వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరపాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికైనా జనం గుండె చప్పుడు తెలుసుకోవాలని, జ్ఞానోదయం కలిగినందుకు సంతోషమని.. వారు ప్రజలను మరిన్ని ప్రశ్నలు ఇంకా డైరెక్టుగా అడిగి ఉంటే సమూలంగా తుడిచిపెట్టుకుపోయామన్న వాస్తవం వారికి తెలిసేదన్నారు. ఒక ఏడాదిలోనే ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన దృష్ట్యా గత సంవతర్సంలో ఫ్రాన్సులో అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్, శ్రీలంకలో రానిల్ విక్రమసింఘే చేసినట్లుగా ఎన్నికు నిర్వహించాలని.. ప్రజలు వాళ్లకు ఎవరు కావాలో నిర్ణయించుకుంటారన్నారు. గత ఏడాదిగా మీరు దోచుకున్న తెలంగాణ ప్రజల ఆస్తుల వివరాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాయితీగా వెల్లడిస్తే కొంత మేరకు క్షమాభిక్ష లభిస్తుందని.. దోపిడీ సొమ్మును పక్క రాష్ట్రాలకు తరలిస్తే సీఐడిని పెట్టి అటాచ్ చేయాల్సి వస్తదని హెచ్చరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనపై సునీల్ కనుగోలు ఓటింగ్ నిర్వహిస్తే.. 86% మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వమే బాగుందని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఈ సమధానం చెంపపెట్టు లాంటిదని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
సోషల్ మీడియాను బలోపేతం చేస్తాం: పీసీసీ చీఫ్
పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తాజా పోల్ రిజల్ట్స్‌పై స్పందించారు. తమ సోషల్ మీడియాను మరింత స్ట్రాంగ్ చేసుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జనాలు ఎవరూ ఫాం హౌజ్ పాలన కోరుకోరని, సోషల్ మీడియాలో తప్పుడు సర్వేలు జరుగుతున్నాయంటూ డ్యామేజ్ కంట్రోల్‌కు ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మీద అభిమానం ఉంటుందని, తమ సోషల్ మీడియా టీమ్ కొంత వీక్ ఉందని.. స్త్రెంథెన్ చేస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేశామని, తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పోల్ ఫలితాల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని ఆ పార్టీ సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీశ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ బాట్ యూజర్స్‌తో ఓట్లు వేయించిందని విమర్శించారు. ఎవరైనా ఫాం హౌస్ పాలన కోరుకుంటారా అని ప్రశ్నించారు.