సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామా - కేటీఆర్


Published Jan 29, 2025 03:50:18 PM
postImages/2025-01-29/1738146018_WhatsAppImage20250129at1.38.54PM1.jpeg

సర్పంచ్ ఓట్ల కోసమే భరోసా హడావుడి

చెప్పినట్టు టకీ టకీమని డబ్బులు పడ్డయా?

రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా.?

వరిలో నల్లగొండను నెం.1 చేసిందే కేసీఆర్

ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్

ఆ ఆనవాళ్లు చెరిపేసుటానికే రైతుబంధు బంద్ చేస్తుండు

ఫ్లోరైడ్ తో జిల్లాను ఆగం చేసిందే కాంగ్రెస్

నల్లగొండ ఐటీ హబ్ కళ తప్పింది!

దారిపొడవునా కేటీఆర్‌కు ఘన స్వాగతం

రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

హైలెట్‌బాక్స్: నల్లగొండ క్లాక్ టవర్ గులాబీమయమైంది. మహాధర్నాకు రైతులు కదం తొక్కారు. కేటీఆర్ రాకతో గులాబీదళం కదలి వచ్చింది. రైతుసమస్యలపై సర్కార్‌ను నిలదీసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ కట్టుబడ్డారని, ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. ఐటీ కళను తీసుకొచ్చామని, వరి పంటలో రాష్ట్రంలోనే నెం.1 చేశామని చెప్పుకొచ్చారు. రైతుల పక్షాన నిలబడతామని, హామీల అమలులో ప్రభుత్వాన్ని ఎండగడతామని హామీ ఇచ్చారు. తనను గుర్తించరనే ఆత్మనూన్యత భావంలో రేవంత్ రెడ్డి ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.  

 

తెలంగాణం, నల్లగొండ(జనవరి 28): నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణమే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జనాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నల్లగొండ బిడ్డలు జీవచ్ఛవాళ్లా మారడానికి కారణమన్నారు. నల్లగొండ రైతులు అవస్థ పడ్డారని అంటే కాంగ్రెస్సే కారణమని, కొత్త సీసాలో పాత సారా అన్నట్లు రేవంత్‌ రెడ్డి పాలన ఉందన్నారు. రైతుభరోసాకు రాం రాం అంటారని కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఏడాదయ్యింది ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలేదన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పడుతుండేదని, రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టాక నాట్లు పడ్డప్పుడు కాకుండా, ఓట్లు వచ్చినప్పుడు రైతుభరోసా డబ్బులు పడతాయని ఎద్దేవా చేశారు. నల్లగొండలోని క్లాక్ టవర్ దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రైతు మహాధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పోరాటాల గడ్డ నల్లగొండ అంటూ నల్లగొండ నేలకు కేటీఆర్ వందనం చేశారు.

 

నల్లగొండకు ఐటీ టవర్‌ కళ తప్పిందని, కోమటిరెడ్డి వచ్చాక తాగుబోతుల అడ్డాగా మారిందేమోనని ఎద్దేవా చేశారు. ధర్నాకు వచ్చిన జనాన్ని చూస్తుంటే విజయోత్సవ సభలా అనిపించిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి అయినా ప్రజా శక్తి కంటే గొప్పది కాదని, హైకోర్టు, న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు చెప్పాలని, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అడ్డుకున్నా హైకోర్టు పర్మిషన్లు ఇచ్చిందని తెలిపారు. రాజ్‌భవన్‌ ముందు ధర్నా చేస్తే ఏం ఇబ్బంది కాదట.. క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో ధర్నా చేస్తే ఇన్‌కన్వీనియన్స్ అయితుందట అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. భవిష్యత్ మళ్లీ గులాబీ జెండాదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయె, పాలమూరు, నల్లగొండ పంటలన్ని ఎండిపాయే’’ అంటూ కేసీఆర్ పాట రాశారన్నారు. సూడు సూడు నల్లగొండ.. గుండె నిండా నల్లబండఅని.. ఫ్లోరైడ్‌ గురించి ఆనాడు కేసీఆర్ పాట రాశారన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టారని.. చివరి మడి, చివరి తడి వరకు నీళ్లిచ్చిన రైతు నాయకుడు కేసీఆర్ అన్నారు. పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నామని పెదకాపర్తి రైతు తనతో చెప్పాడన్నారు. జనవరి 26న రాత్రి 12 గంటలకే టకీ టకీ అని పైసలు పడతాయని రేవంత్‌ అన్నారని, పడ్డాయా అని అక్కడికి వచ్చిన రైతులను ఉద్దేశించి అడిగారు. రైతుల మీద ఉన్న ప్రేమతో కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇచ్చారని, కేసీఆర్ ప్రభుత్వం రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిందన్నారు. కేసీఆర్‌ పాలనలో టింగ్‌ టింగ్‌ మని డబ్బులు ఖాతాలో పడేవన్నారు. ఆరేండ్లు నిరాటకంగా వేశారన్నారు.

 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే కొత్త డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జనవరి 26న మొదలై మార్చి 31 వరకు సాగుతుందని సీఎం అంటున్నారు, మార్చి 31 అన్నారు కానీ, ఏ సంవత్సరమో చెప్పలేదని సెటైర్ వేశారు. 14 నెలలు గడిచినా రుణమాఫీ కాలేదని, బయట మొరుగుడు కాదని, ఏ ఊరు పోదామో పోదామని, ఏ ఊర్లో అయినా రుణమాఫీ అయ్యిందని రాసిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీపై బ్యాంకులోళ్లందరినీ పిలిచి మాట్లాడారని, రుణమాఫీ కోసం రూ.45,500 కోట్లు కావాలని బ్యాంకు అధికారులు చెప్పారన్నారు. వారం రోజులకు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రూ.40 వేల కోట్లు సరిపోతాయన్నారని చెప్పారు. తర్వాత నెలకు రూ.31 వేల కోట్లు సరిపోతయన్నారని, ఆఖరికి జూన్‌లో క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి రూ.26 వేల కోట్లు సరిపోతయని, బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లే కేటాయించారన్నారు. కానీ ఇప్పటికీ రుణమాఫీకి ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.12 వేల కోట్లు కూడా దాటలేదన్నారు. అందుకే రూ.49 వేల కోట్లలో పావులా వంతు కూడా రుణమాఫీ కాలేదని కేటీఆర్‌ అన్నారు.

 

గ్రామసభల్లో నిలదీస్తున్న రైతులు

 

గ్రామ సభలకు పోతే రైతులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నరన్నారు. కేసీఆర్‌ 2 పంటలకే ఇస్తున్నాడని విమర్శించి, తాను మూడు పంటలకు ఇస్తానని గొప్పలకు పోయాడన్నారు. ఒక్క పంటకు ఇయ్యడానికే కిందా మీద అయితుండని, మోసం చేయడం కూడా చరిత్రాత్మకమట అట అని విమర్శించారు. దరఖాస్తుల పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. దరఖాస్తులు.. దండాలు పెట్టడం తప్ప ఏమీ లేదనే దగ్గరకు వచ్చిందని, రుణమాఫీ, రైతుబంధు, బోనస్‌ అన్నీ బోగస్ అయ్యాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే రైతుభరోసా అనే డ్రామా ఆడుతున్నారని, కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్‌ అంటున్నాడని విమర్శించారు. ఆరోగ్య శ్రీ అంటే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారని, రైతుబంధు అంటే కేసీఆర్‌ గుర్తుకు వస్తారని అన్నారు. రైతుభరోసా డబ్బులు వేస్తే కేసీఆర్‌నే తలుచుకుంటారని, తనను గుర్తించరనే గుంపు మేస్త్రీ పన్నాగం పన్నాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఒక్కో ఎకరానికి రూ.17,500 బాకీ ఉన్నాడని, కాంగ్రెసోళ్లు మళ్లీ ఓట్ల కోసం వస్తారని, నిలదీయండి.. పోరాటాల పురిటి గడ్డ నల్లగొండే మళ్లీ రాష్ట్రంలో రైతులు తిరగబడేటందుకు వేదిక కావాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినంక రైతులు 410 మంది చనిపోయారన్నారు. గురుకులాల్లో పిల్లలు 55 మంది, ఆటో డ్రైవర్లు 100 మంది చనిపోయారన్నారు. చేనేత కార్మికులు 35 మంది చనిపోయారన్నారు. మీటింగ్‌ పెట్టుకుంటామంటే అడ్డుకోవడం దారుణం కాదా అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే గడియారం సెంటర్‌‌కు వచ్చి, ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

 

నల్లగొండకు కేసీఆర్ ఎన్నో చేశారు!

 

పంజాబ్‌, హర్యానాను తలదన్నేలా వరి పంటలో భారతదేశంలోనే తెలంగాణను నెంబర్‌ వన్ చేసిన ఘనత కేసీఆర్‌‌కు దక్కుతుందన్నారు. తెలంగాణలో నల్లగొండ జిల్లా వరి ఉత్పత్తిలో నెంబర్‌ వన్ అయ్యిందన్నారు. కృష్ణ, గోదావరిలో ప్రతి ఒక్క నీటి బొట్టును కేసీఆర్ ఒడిసిపట్టారని చెప్పారు. జిల్లాలో  మూడు మెడికల్ కాలేజులు కట్టించారన్నారు. యాదాద్రి గుడిని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ లక్ష్మీనర్సింహ స్వామి రుణం తీర్చుకున్నది కేసీఆర్ అన్నారు. దామరచర్లలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ అని తెలిపారు. చెప్పుకుంటూ పోతే నల్లగొండకు ఎన్నో మంచి పనులు చేశామని కేటీఆర్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy ktr panchayat-elections

Related Articles