అరెకపూడి భారీ భూస్కామ్!
ఎమ్మెల్యే కుటుంబం చేతిలో 17 ఎకరాల భూమి
సీలింగ్ భూమిని ఆక్రమించుకున్న వైనం
ఆ భూమి కోసమే పార్టీ మార్పు
ఇది చంద్రబాబు శిష్యుల భూదందా
రేవంత్ సర్కార్లో ఇలాంటి వారికే పదవులు
సిద్ధాంతంతో ఉన్నవారికి రానేరావు
బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు
తెలంగాణం, హైదరాబాద్(జనవరి 30): పేదలకు గజం భూమి ఇవ్వడానికి నానా రభసా చేసే ప్రభుత్వం.. పెద్దలకు మాత్రం ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తోందని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న వారికంటే, స్వలాభం కోసం వచ్చే వారికే నేడు రేవంత్ సర్కార్ పదవులు ఇస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయించిన అరెకపూడి గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. భారీ భూకుంభకోణానికి అరెకపూడి గాంధీ పాల్పడ్డారని, ఆ భూముల కోసమే ఆయన పార్టీలో చేరారని ఆరోపించారు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులను రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, పార్టీకి రాజీనామా చేస్తేనే తీసుకోవాలని చెప్పారని, కానీ, దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి, అధికార పార్టీలో చేరుతున్నారని, అసలు సిద్ధాంతం కోసం కాదని అన్నారు.
గురువారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో ఉన్న కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామంలో సుమారు 17 ఎకరాల భూమికి అరెకపూడి ఫ్యామిలీ ఎసరుపెట్టిందని ఆరోపించారు. ఖాతా నంబర్ 10402, సర్వే నంబర్ 307/Aలో అరెకపూడి శ్యామలాదేవి పేరు మీద 2 ఎకరాల భూమి, ఖాతా నెంబర్ 60226లో సర్వే నెంబర్ 307/ఏ/2లో అరెకపూడి నందిత గాంధీకి, అరెకపూడి కోటేశ్వర రావులకు, అలాగే సర్వే నంబర్ 307/ఏ/3లో అరెకపూడి రాజేంద్రప్రసాద్ పేరు మీద 8 గుంటలు, 307/ఏ/4లో అరెకపూడి ప్రణీత్ కుమార్ పేరు మీద 2 ఎకరాలు, 60205 ఖాతా నంబర్లో 307/ఏ/5లో అరెకపూడి స్వర్ణ కుమారి పేరు మీద 0.1200 గుంటలు, ఖాతా నెంబర్ 60329లో సర్వే నంబర్ 307/ఏ/7లో గుమ్మడి లక్ష్మీ నారాయణ పేరు మీద ఎకరా భూమి, ఖాతా నెంబర్ 361 లో సర్వే నంబర్ 307/ఈ/ఈ/1 లో శ్రీనివాస్ ఎం పేరు మీద నాలుగు ఎకరాల భూమి ఉంది. ఇవన్నీ కూడా 307 సర్వే నంబర్లోనే ఉండటం గమనార్హం. దాదాపు 17 ఎకరాల భూమిని అరెకపూడి కుటుంబానికి కట్టబెట్టడానికి రేవంత్ సర్కార్ చూస్తుందన్నారు. ఇదంతా సీలింగ్ భూమి అని, ఏపీఐసీసీ తీసుకుని మళ్లీ ప్రభుత్వానికి అప్పగించిందని, కానీ, అరెకపూడి గాంధీ ఖాతాలో ఎలా చేరిందన్నది ప్రశ్న అని అన్నారు. దీని కోసమే ఆయన పార్టీలో చేరాడా అన్నది అసలైన క్వశ్చన్ అన్నారు. ఓ సామాన్య వ్యక్తిగా తాను ఇంతటి కుంభకోణాన్ని బయటపెట్టానని, బీజేపీ నేతలు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వ కుంభకోణాలపై మౌనం ఎందుకన్నారు.
పార్టీ ఫిరాయించిన ఆయనకు కేబినెట్ ర్యాంక్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. వీళ్లిద్దరికీ టీడీపీలో ఉన్నప్పటి నుంచి స్నేహం ఉందన్నారు. చంద్రబాబు శిష్యులని, పాత టీడీపీ దోస్తులని, టీడీపీ పాత సంబంధాలు ఉన్నవారికే నేడు కాంగ్రెస్ పార్టీలో ఏ అవకాశమైనా దొరకుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీని, సిద్ధాంతం నమ్ముకున్న వారికి ఎలాంటి పదవులు ఉండవన్నారు. కుత్బుల్లాపూర్ ఆయన నియోజకవర్గం కానే కాదని, శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అందుకే వాళ్లు నవీన్ మిట్టల్ లాంటోడిని పెట్టుకున్నారని, ఆయనతోనే ఇవన్నీ సాధ్యం అవుతాయని ఆరోపించారు.