సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్
కమర్షియల్ క్రాప్ వేయాలి
ప్రకృతి వనాలు పెంచాలి
ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది
త్వరలోనే టూరిజం పాలసీ
ఎకో టూరిజాన్నిప్రోత్సహిస్తాం
దావోస్‌లో ఒప్పందాలు జరిగాయి
ఎక్స్‌పీరియం పార్క్ ప్రారంభానికి హాజరు
తెలంగాణం, బ్యూరో (జనవరి 28): రాష్ట్రంలోని రైతులు రాబోయే రోజుల్లో కేవలం వరి పండించడమే కాదని, ఇతర కమర్షియల్ క్రాప్ వైపు మళ్లాలన్నారు. ప్రకృతి వనాలు పెంచడానికి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దగ్గర ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పటికే ఐటీ, పారిశ్రామిక, ఇన్ఫ్రాస్టక్చర్‌లో రాణిస్తోందని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, గుర్తింపు రావాలంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదని, రాష్ట్రంలోని టెంపుల్, ఎకో టూరిజం ఆదాయంతో పాటు గుర్తింపు పెంచుతోందన్నారు. అందుకే ఇప్పుడు టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం కావాలన్నారు.
రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనుకబడిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు. రామప్ప, వెయి స్థంబాల గుడి, వేములవాడ, నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవాల్ ఫారెస్ట్ ఉన్నాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో టూరిజం పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజంను ప్రోత్సహిస్తామన్నారు. వికారాబాద్ అడవిలోని ప్రకృతి సహజ వనరులతో అనేక రోగాలు నయం అయ్యేవని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మెడిసిన్ అందుబాటులో లేని రోజుల్లో టీబీ వచ్చిన రోగులను ఇక్కడ 2,3 నెలలు ఉంచితే పూర్తిగా నయం అయ్యేదని చెప్పారు. తొందర్లోనే వికారాబాద్ ప్రాంతంలో ఎకో టూరిజంను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటోందని, దావోస్ పర్యటనలో అగ్రిమెంట్ కూడా జరిగిందన్నారు.
రాందేవ్‌రావు తన 25 ఏళ్ల అనుభవంతో 150 ఎకరాల్లో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్‌పీరియం పార్క్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీటిలో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి పెట్టడం, దాదాపు 25వేల జాతుల మొక్కలు పెట్టి అద్భుతం సృష్టించారన్నారు. ఇది ఆదాయంతో పాటు రాష్ట్రానికి గౌరవం తీసుకొస్తోందన్నారు. దీని ద్వారా ఇక్కడి ప్రాంతం పర్యాటక క్షేత్రంగా మారుతుందన్న నమ్మకం ఉందన్నారు. దీన్ని మరింత పర్యాటకంగా తీర్చి దిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఏపీ ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.