తేలిపోతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు!


Published Jan 31, 2025 02:04:39 PM
postImages/2025-01-31/1738312479_WhatsAppImage20250131at1.06.10PM.jpeg

తేలిపోతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు!

కోర్టుల్లో సర్కార్‌కు వరుస ఎదురు దెబ్బలు

హైకోర్టులో భుజంగరావు, రాధాకిషన్ రావకు బెయిల్

మొన్న సుప్రీంలో తిరుపతన్నకు బెయిల్

ఆధారాలు చూపలేకపోతున్న ప్రభుత్వం

ఆరోపణలతో కేసు సాగదీసిందన్న విమర్శలు

ప్రణీత్ కుమార్ బెయిల్ పై ఉత్కంఠ

 

 

 ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే సుప్రీం కోర్టు తీర్పుతో A4 తిరుపతన్నకు బెయిల్ దక్కగా, తాజాగా మరో ఇద్దరు బెయిల్ పొందారు. నెలల తరబడి కేసును సాగదీసిందని, ఆధారాలు మాత్రం చూపలేకపోయిందన్న విమర్శలను రేవంత్ సర్కార్ మూటగట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక పార్టీ నాయకులను ఇరికించే లక్ష్యం తప్ప మరొకటి లేదన్న విమర్శలు ఉన్నాయి.

 

తెలంగాణం, హైదరాబాద్(జనవరి 30): ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సర్కార్‌కు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరూ బెయిల్‌పై విడుదలవుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలను చూపకుండా.. కేవలం నేరారోపణలతో నెలల తరబడి జైల్లో ఉంటున్న వారికి న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తున్నాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు గురువారం బెయిల్‌ మంజూరైంది. హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున 2 ష్యూరిటీలు, పాస్‌పోర్టులు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేసింది. అంతకు ముందు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరఫున పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు హైకోర్టులో వాదించారు. నిందితులు ఇద్దరూ రాజకీయ నాయకుల, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారని తెలిపారు. దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ప్రణీత్ కుమార్‌కి బెయిల్ రావలసి ఉంది.

 

ఆరోపణలు తప్ప.. ఆధారాలెక్కడ?

 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి నుంచి ఉన్న ఆరోపణలే తప్ప ఆధారాలు చూపలేకపోయిందన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే వ్యక్తులపై కేసులు పెట్టి, వారిని జైలుకు పంపిందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎస్ఐబీలో వారి వృత్తి వారు చేశారని, వృత్తిలో భాగంగా వాటిని డిస్పోజ్ చేయడం సర్వసాధారణం అయినప్పుడు వారిపై కేసులెందుకన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు కూడా ఇదే ప్రశ్నించిందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కేసులో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ, లీకులు మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చిందంటున్నారు. కోర్టులో నడవాల్సిన ట్రయల్స్ మీడియాలో నడిచాయంటున్నారు. సరిగ్గా బెయిల్‌పై తీర్పు వచ్చే ముందు ఏదో ఒక లీకు ఇవ్వడం పరిపాటిగా మారిందన్న చర్చ జరుగుతోంది. సుప్రీం కోర్టులో తిరుపతన్న బెయిల్‌పై తీర్పు సందర్భంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యిందన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా హైకోర్టులో తీర్పు సందర్భంగా న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని వార్తలు వచ్చాయి. ఇలా ప్రతిసారి లీకులు ఇవ్వడమే తప్ప, ఆ కేసుకు బలాన్ని చేకూర్చే ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం సంపాదించలేకపోయిందని, కేవలం ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలను ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. 

 

సుప్రీం కోర్టు సీరియస్ కామెంట్స్!

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఈ నెల 27న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 10 నెలలుగా పిటిషనర్‌ జైలులో ఉన్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని, ఇంకా జైలులో ఉండాల్సిన అవసరం కనిపించడం లేదని పేర్కొంది. ఇన్ని నెలలుగా ఆయన తప్పు చేశారని చెప్పడానికి ఒక్క ఆధారం చూపలేకపోయారని, 29 ఏళ్లుగా తిరుపతన్న ప్రభుత్వం కోసం పని చేస్తున్నారని, ఆయనపై ఒక్క ఆరోపణ లేదని కుండబద్ధలు కొట్టింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా ఆయన పని ఆయన చేసుకుపోయారని, తన బాధ్యత తను నిర్వర్తించారని ధర్మాసనం పేర్కొనడం గమనార్హం

newsline-whatsapp-channel
Tags : supremecourt cm-revanth-reddy phone-tapping

Related Articles