చట్టం
అధికార పార్టీ చుట్టం..!
నాడు అల్లు అర్జున్‌పై చకచకా చర్యలు
నేడు కిషన్ రెడ్డిపై యాక్షన్ లేదా ?
ట్యాంక్‌బండ్ ప్రమాదంలో ఇద్దరు మృతి
కిషన్ రెడ్డి మహా హారతి కార్యక్రమంలో ఘటన
కేంద్రమంత్రిని బాధ్యుడిని చేయరా ?
మహాకుంభమేళా ఘటనలో పలువురు మృతి
యూపీ సీఎం యోగి బాధ్యుడు కాదా ?
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి
అధికారులపై చర్యలతో సరిపెట్టేసిన ఏపీ సర్కార్
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు మృతి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చర్యల్లేవా ?
వరస ఘటనలు.. పలు సందేహాలు
మనం మనం తెనాలి అన్నట్టుగా వ్యవహారమా?
‘కర్ర ఉన్నోడిదే బర్రె’ అంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు దాన్నే గుర్తు చేస్తోంది. అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని, ఏదైనా ఘటన జరిగితే తమకో రూల్‌ను, తమకు నచ్చని వారిపై మరో రూల్‌ను అమలు చేస్తున్నారు. ప్రమాణస్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటామని, తమ, పర అనే తేడాలను చూడమని చెప్పే నేతలు.. అధికార పీఠంపై కూర్చోగానే అన్నింటిని మర్చిపోతున్నారు. చట్టాలను, అధికారాన్ని తమకు నచ్చినట్టు వాడేస్తున్నారు. భారతమాతకు మహాహారతి, మహా కుంభమేళా తొక్కిసలాట, ఏపీలో జరిగిన తిరుపతి తొక్కిసలాట, గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం జరిగిన ప్రమాదాలను గమనిస్తే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పక్షపాత వైఖరి ఇట్టే అర్థమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(జనవరి 29): సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో రేవంత్ సర్కార్ తీవ్రస్థాయిలో స్పందించింది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు పూర్తిగా ఆయన్ను బాధ్యుడిని చేస్తూ కేసులు కూడా పెట్టి జైలుకు పంపే వరకు ఊరుకోలేదు. ఈ పరిణామాలు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో సంచలనం సృష్టించాయి. అంతేకాదు మొన్నటి దావోస్ పర్యటన సందర్భంగానూ సీఎం రేవంత్ రెడ్డిని మీడియా ఈ అంశంపై ప్రశ్నించడం గమనార్హం. అయితే తాజాగా సరికొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో, దేశంలో జరిగిన పలు ఘటనలను గుర్తు చేస్తూ, ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రమంత్రిపై చర్యలుండవా?
జనవరి 26న హుస్సేన్ సాగర్‌లో జరిగిన పడవ ప్రమాదంపై రేవంత్ సర్కార్ వైఖరి ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారతమాతకు మహాహారతి కార్యక్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అల్లు అర్జున్ విషయంలో చకచకా నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ఎందుకు మౌనంగా ఉందన్న చర్చ జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ఒకరికొకరు అవగాహనతో నడుచుకుంటున్నారని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడం విశేషం. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలకు దిగడం విశేషం. కిషన్ రెడ్డి వెంటనే స్పందించాలని నిలదీస్తున్నారు. కార్యక్రమం జరిగి రెండు రోజులైనా ఎలాంటి స్పందన కేంద్రమంత్రి నుంచి లేకపోవడంపై మండిపడుతున్నారు.
మహాకుంభమేళా తొక్కిసలాటకు బాధ్యులెవరు?
బుధవారం ‘మౌని అమావాస్య’ సందర్భంగా మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాట తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందారు. గాయాలపాలై ఆస్పత్రికి చేరుకున్నవారు ఎందరో. కేంద్ర, రాష్ట్రాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కుంభమేళాకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వాల కారణంగానే నిండు ప్రాణాలు పోయాయని, దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
తిరుపతి తొక్కిసలాటలో తప్పెవరిది?
వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల వ్యవహారం కూడా తెరమీదకు వచ్చింది. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. దీనికి బాధ్యులు ఎవరన్న చర్చ జరుగుతోంది. ఏపీ సర్కార్ అధికారులను బాధ్యులను చేసి తప్పించుకుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వంపై నిందలు పడుకుండా వారిపైనే నెపం నెట్టేశారన్న వాదన కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, కానీ తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా అధికారులనే తప్పుబట్టడం ఏంటన్న చర్చ కూడా జరుగుతోంది. కేంద్రం చర్యలు సిద్ధమైందన్న తరుణంలో సీఎం చంద్రబాబు తన పలుకుబడితే వారి విచారణను నిలిపివేయించారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
జనవరి 5న రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్తూ ప్రమాదానికి గురైన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) చనిపోయిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై డిప్యూటీ సీఎం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు యువకులు మృతికి బాధ్యత వహించాల్సింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న వాదనలు వినిపించాయి. ఆయన సభకు వస్తున్నారనే యువకులు వచ్చారని, తిరిగి ఇంటికి వెళ్తూ ప్రాణాలు కోల్పోయారని కుటుంబ సభ్యులు అంటున్నారు. మృతులకు పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అని, శిక్ష కూడా ఉండాల్సిందనేనన్న చర్చ నడుస్తోంది.
ఈ నాలుగు ఘటనల్లో ఎలాంటి తక్షణ చర్యలు లేవని, తూతూ మంత్రంగా చర్యలు మాత్రమే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమదైతే, చట్టం కూడా గుడ్డిదైపోతుందని, ఎవరికేమైనా అస్సలు పట్టింపు ఉండదని, ప్రత్యర్థుల విషయంలో మాత్రం చట్టాలకు పదునెక్కువన్న చర్చ జరుగుతోంది. మహాకుంభమేళాకు బాధ్యుడిగా ఉండాల్సిన వ్యక్తి యూపీ సీఎం యోగి కాగా, మహాహారతి కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీటీడీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ దోషిగా ఉండాల్సి ఉంటుందని అయినా ప్రభుత్వాలు మౌనంగా ఉండిపోయాయంటున్నారు.