420 హామీలు/రోజులు
నేడు గాంధీజీ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్త నిరసనలు
మహాత్ముని విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు
డూప్లికేట్ గాంధీలకు బుద్ధి రావాలని విజ్ఞప్తి
100 రోజులని చెప్పి 420 రోజులైనా అమలు కాని హామీలు
బండరాయిలా రాష్ట్ర ప్రభుత్వం.. చలనం లేదని విమర్శ
421 మంది రైతుల ఆత్మహత్యలు.. 30 మంది ఆటోడ్రైవర్లు
గురుకులాల్లో కల్తీ ఆహారంతో 55 మంది విద్యార్థులు దుర్మరణం
రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగడతామంటోన్న బీఆర్ఎ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులయ్యింది. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికీ సక్రమంగా అమలు చేయలేక ఆపసోపాలు పడుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బాండ్ పేపర్ మీద రాసి మరీ మాటిచ్చిన కాంగ్రెస్.. నేడు వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో హామీలపై జనం నిలదీస్తున్నా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తమది గాంధేయవాద పద్ధతని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఆ మహాత్ముడు బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనల కార్యక్రమం చేపట్టారు. మహాత్ముని విగ్రహాలకు వినతి పత్రాలు అందజేయనున్నారు.
తెలంగాణం, హైదరాబాద్(జనవరి 29): ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటూ గాంధీల పార్టీకి గాంధేయవాద పద్ధతిలో చెప్పేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అయిన సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా 420 లాంటివి కావడం వల్లే వాటిని నెరవేర్చడం లేదని ఎద్దేవా చేస్తున్నారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలోని కీలక నేతలు, శ్రేణులు పాల్గొనాలని కోరారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించి, వినతి పత్రాలు ఇవ్వనున్నారు. డూప్లికేట్ గాంధీలకు బుద్ధి వచ్చేలా చేయాలని ఆ మహాత్ముడిని కోరనున్నట్టు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం రాయిలాగా మారిందని, ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు తెలిపినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని.. అందుకే విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తున్నామన్నారు. దీంతో అయినా కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీకి కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం
రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెప్పారని, 2021 లోనే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారని గుర్తు చేసింది. మానవతా దృక్పథంతో కేసీఆర్ ఆలోచించి, ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదాయ పరిమితిని సడలించారని ఆ పార్టీ తెలిపింది. బాండ్ పేపర్లు, అఫిడవిట్లు ఇచ్చి మరి ప్రజలను మోసగించారని, గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలను ప్రచారం చేశారన్నది. అశోక్ నగర్లో తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేసారని ఆరోపించింది. ఇక్కడున్న రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వండని అడిగిన నిరుద్యోగులను తీవ్రంగా కొట్టి జైల్లో వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 420 రోజులు దాటుతున్నా నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించింది. తమ ప్రభుత్వంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని తెలిపింది. కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ని, కోట్ల ప్రజాధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్దాలు పలికి ఇప్పటి వరకు వారికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేసింది.
412 మంది రైతులు ఆత్మహత్యలు
కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదని, మోసపోయిన ప్రజల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణ మాఫీ చేశారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాక్ డౌన్, నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని రూ. 28,275 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. అబద్దపు హామీలను నమ్మినా ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ. 12 వేలు అని చెప్పి, రైతు భరోసా 12 వేలు అంటూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26కు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31కి అంటున్నారన్నారు. రైతు కూలీలకు రూ.12 వేలు అన్నది బూటకమని విమర్శించారు. అప్పుడు రైతు బంధు రూ.10 వేలు బిక్షం అన్న రేవంత్ రెడ్డి 420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు.
ఏరు దాటాక తెప్ప తగలేసే రకం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తూ.. చెనేతలకు ఉపాధి కల్పించి వారికీ ఆర్థిక సహాయం అందించేవారమని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు లేవని, చేనేతలకు ఉపాధి కూడా లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో 30 మందికి పైగా చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గ్రామ సభలల్లో ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించిన రైతులను పోలీసులతో, కాంగ్రెస్ గుండాలతో కొట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే రకమన్నారు. హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తోందన్నారు.