కాంగ్రెస్ కార్యకర్తలాగా నల్గొండ కలెక్టర్..!
బిల్లుల కోసం మంత్రి దగ్గరికి పోవాల్నా..?
చట్టపరంగా పనిచేయకపోతే చర్యలు తప్పవు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీరియస్
తెలంగాణ, నల్గొండ (ఏప్రిల్ 4): నల్గొండ జిల్లా కలెక్టర్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలవకుండా బిల్లులు విడుదల చేయొద్దని కలెక్టర్ మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ తమ దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. చట్టపరంగా పని చేయకపోతే రికార్డింగ్స్‌తో సహా ఫిర్యాదు చేయాల్సి వస్తుందని కలెక్టర్‌ని హెచ్చరించారు. పోలీస్ ఉన్నతాధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టాలని తమ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కరిపైన కేసు పెడితే 1000 మంది పోలీస్ స్టేషన్‌కు వస్తారని వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి లోబడి పని చేయకుండా, కాంగ్రెస్ మంత్రి చెప్పినట్టు నడుచుకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
ఇక జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని విమర్శించారు. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరపలేదని తప్పుబట్టారు. రైతులు అన్ని విషయాల్లో మోసపోయారని, రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగొళ్లు లేవని మండిపడ్డారు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదని అన్నారు. నల్లగొండలో ఓ మంత్రికి సోయి లేదని అసహనం వ్యక్తం చేశారు. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడని, ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారని అన్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు.