ఓరుగల్లులో కారు స్పీడ్ కు బ్రేకులు పడుతున్నాయా..? ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో అక్కడి నేతలు వెనకడుగు వేస్తున్నారా..? మొన్న పంచాయతీ, నిన్న మున్సిపల్ ఎన్నికల్లో వైఫల్యానికి నేతల తీరే కారణమా..? నాయకుల మధ్య వర్గపోరు దేనికి..? అధిష్టానం హెచ్చరించినా మార్ప రాలేదా..? పార్టీకి పూర్వ
ఉమ్మడి వరంగల్ జిల్లా.. ఒకప్పుడు గులాబీ జెండా రెపరెపలాడిన అడ్డా. కారుకు కంచుకోట. అక్కడి నాయకులు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సమర్ధులు. జిల్లాలో కారు పార్టీకి బలమైన క్యాడర్ ఉండేది. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అక్కడి నాయకుల్లో దూకుడు కనిపించేది.. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. రెండేళ్ల క్రితం అధికారం కోల్పోయిన తర్వా క్యాడర్ కాస్త నైరశ్యం ఏర్పడిందట. దాంతో కార్యకర్తలు, లీడర్లు డీలా పడిపోయిందట.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓరుగల్లులో గులాబీ నేతలుకు వరుస దెబ్బలు తగుతున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓరుగల్లు గులాబీ నేతలు, లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావించారట. కానీ, పంచాయతీ ఎన్నికల్లో అనుకున్న రేంజ్ లో రిజల్ట్ రాలేదు. అరకొర స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటి పట్టణాల్లో తమ పార్టీ బలంగా ఉందని చెప్పుకుందామని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. జనగాం, తొర్రూరు లాంటి ప్రాంతాల్లో అనుకున్న రిజల్ట్ వచ్చినా.. కాంగ్రెస్ బలవంతంగా లాక్కోవడం, దౌర్జన్యం చేయడంతో నేతలు షాక్ అయ్యారట. రోజు రోజుకు ప్రజల్లో పార్టీ బలహీన పడుతుండడం, ప్రజాక్షేత్రంలోకి నేతలు వెళ్లేందుకు వెనుకాడుతుండడంతో అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
వరంగల్ లో పార్టీ డీలా పడడం వెనక గ్రూప్ రాజకీయాలు ఉన్నాయట. దాంతో పార్టీ భ్రష్టు పడుతుందని గులాబీ బాస్ కేసీఆర్ గుర్తించారు. త్వరలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడం.. పార్టీని చక్కదిద్దేందుకు హరీష్ రావు రంగంలోకి దిగారు. వరంగల్ లో గులాబీ పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నించాలని కోరిందట అధిష్టానం. అందుకే ఆయన వరుసగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు, సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం హరీష్ రావు రెండుసార్లు జిల్లాలో పర్యటించారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు, వరంగల్ హెల్త్ సిటీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చుకలు అంటిస్తూ, గులాబీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో హరీష్ రావు ఎంట్రీతో, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగడంతో పాటు.. గులాబీ నేతల మధ్య వర్గపోరుకు సైతం చెక్ పడుతుందని ఆ పార్టీ సీనియర్లు భావిస్తున్నారట.
మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న రేంజ్ లో స్థానాలు దక్కకపోవడం కూడా అధిష్టానం ఆగ్రహంతో ఉంది. మెజారిటీ కౌన్సలర్ స్థానాలు సాధించిన జనగామ, వర్థన్నపేట, తొర్రూరు మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాల్సింది పోయి, మాకెందుకులే అంటూ ఫామ్ హౌస్ లకే పరిమితమయ్యారట. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన ఒంటరి పోరు చివరికి బూడిదలో పోసిన పన్నీరు అయిందని గులాబీ పార్టీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని చక్కదిద్దకపోతే, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కారు పల్టీలు కొట్టాల్సివస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
దీంతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు వరంగల్ జిల్లాపై ఫోకస్ చేశారని, తరచూ పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి హరీష్ రావు ఎంట్రీతో ఓరుగల్లు గులాబీ నేతల మధ్య వర్గపోరుకు ఫుల్ స్టాప్ పడుతుందా..? కార్పొరేషన్ ఎన్నికల నాటికి కారు పార్టీ కొంతైనా ప్రభావం చూపగలుగుతుందా.. ? అనేది చూడాలి.