ఏపీ కూటమిలో చీలికలు వస్తున్నాయా ? జనసేన వర్సెస్ టీడీపీగా మారుతోందా? నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలపై టీడీపీ నేతలే పెత్తనం చేలాయిస్తున్నారా
ఏపీలో కూటమిలో అసంతృప్తి తారా స్థాయికి చేరింది. ప్రభుత్వం ఏర్పడిన ఇంతకాలానికి అది బరస్ట్ అవుతోందా..? స్వయంగా డిప్యూటీ సీఎం పలుమార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదా అంటే అవుననే అంటున్నారు ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది రెండేళ్ల కావొస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొంతకాలం బాగానే ఉన్నా.. ఆ తర్వాత జగడాలు పెరిగిపోయాయి. రాష్ట్ర నేతలు అవగాహన సమన్వయంతో ముందుకు సాగుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఇలాంటి పరిస్థితులు లేవు. కుమ్ములాటలు సమస్యగా మారాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలకు పొసగడం లేదంటున్నారు. చాలా చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా చూసిన టీడీపీదే పెత్తనం అన్న రీతిలో మారిందట పరిస్థితి. తెలుగు దేశం నేతల ఆధిపత్యం నడుస్తున్నా నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందట. అసలు జనసేన నాయకులను పట్టించుకోవడం లేదట. దాంతో జనసేన ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా పెత్తనం మొత్తం టీడీపీదే అంటున్నారు. దాంతో అభివృద్ధి కుంటుపడుతోందంటున్నారు.
ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా కూటమిలో చీలికల గురించి పరోక్షంగా ప్రస్తావించారు. వైసీపీ నేతల్లా మనమెందుకు ఉండడం లేదు అని ప్రశ్నించారు. మనం ఎందుకో చేసింది చెప్పుకోలేక పోతున్నామని పేర్కొన్నారు. కూటమి నేతలు ఏకాభిప్రాయంతో ఉండాలని సూచించారు. కూటమిలో పార్టీలు కలిసి కట్టుగా ఉండాలని.. 15ఏళ్లు రాష్ట్రం కోసం పాటు పడదామని అసెంబ్లీ వేదికగా పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
అంతేకాదు.. ఇష్టం వచ్చినట్టు వైసీపీ తిట్టి.. కులాల వెనక దాక్కుంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరు ఐక్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని అన్నారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2019లో అది సాధ్యం కాలేదని.. 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్నచిన్న సమస్యలున్నా సర్దుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థలు పరస్పర సహకారంతో పని చేయాలని తెలిపారు. ఏ వ్యవస్థలో లోపాలు ఏర్పడినా ప్రజలకు సేవ చేయటంలో ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వెనక పెద్ద మ్యాటరే ఉందని తెలుస్తోంది. పలు నియోజకవర్గాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. వారిని హెచ్చరించినా మార్పు రాలేదట. ముఖ్యంగా, ఇసుక, మైనింగ్ లాంటి వాటిల్లో పాతుకుపోయి క్షేత్ర స్థాయిలో కోట్లు కొల్లగొడుతున్నారని తెలుస్తోంది. టీడీపీ నేతలు చేస్తున్న తప్పులకు ప్రభుత్వం బలి అవుతుందని.. కూటమికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారు. మరోవైపు.. కూటమిలో సగభాగం ఉన్నా జనసేన నేతలను అసలు పట్టించుకోవడం లేదట. దాంతో వారందరూ పవన్ కళ్యాణ్ దగ్గర మొర పెట్టుకున్నారట. ప్రజా ప్రతినిధులుగా ఉన్నా లాభం లేదని.. టీడీపీ నేతలదే పెత్తనం నడుస్తోందని వాపోయారట.
అంతకుముందు ప్రజలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో అసంతృప్తిలో ఉన్నారని కూడా పవన్ పరోక్షంగా చెబుతున్నారు. ఇటీవల కలెక్టర్ల సమావేశంలోనూ పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పథకాల అమలు ప్రచారాన్ని చేయకుండా ఉన్నందునే ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందని అన్నారు. ఎన్ని అభివృద్ధి పనులు చేపట్టినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా, ప్రజల్లో సంతృప్తి కనిపించడం లేదని ఆయనే అన్నారు. మరి కూటమిగా ఉంటూ వీటిని ఎలా అధిగమించాలన్న దానిపై దృష్టి పెట్టాలని, అదే సమయంలో తనను నమ్ముకున్న నేతలకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని చూస్తున్నారట పవన్.
ఇటు చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. అయితే.. మేము ఇద్దరమే క్రమశిక్షణగా ఉంటే సరిపోదని.. అందరూ క్రమశిక్షణతో ఉండాలని.. కూటమి నేతలకు పిలుపునిచ్చారు. పలు చోట్ల పార్టీ నేతలు చేస్తున్న పనులను తెలిసినా టీడీపీ అధినేత పట్టించుకోకపోవడంతో వారు రెచ్చిపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు, సీట్ల పంపకాలపై అసంతృప్తి కారణంగా కూటమిలో చీలికలు వచ్చాయి. పవన్ గతంలో మాట్లాడుతూ కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు చిన్నచిన్న పొరపొచ్చాలు ఉన్నా మీ స్ధాయిలోనే పరిష్కరించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. దాంతోనే అభివృద్ధిలో వెనుకబడ్డ ఏపీ తిరిగి ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని వారికి సూచించారు. కనీసం 15 సంవత్సరాలు ఈ కూటమి చాలా బలంగా ఉండాలని పిలుపునిచ్చారు. కానీ, కూటమి నేతల్లో ఏర్పడుతున్న చీలికలతో మరోసారి రావడం కష్టమేనంటున్నారు ఏపీ పొలిటికల్ విశ్లేషకులు.
Published Mar 10, 2026 03:00:00 PM
Tags : ap-news chandrababu pawankalyan andhrapradesh janasena tdp bjp gusagusa gusa-gusa political-gusagusa