మన దేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ మహానగరం ప్రతిష్టాత్మక 72 మిస్ వరల్డ్ 2025పోటీలకు వేదిక అయ్యింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ అందాల పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వసుందరి కిరీటం దక్కించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా 110 కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మన దేశం తరపున మిస్ ఇండియా నందిని గుప్తా ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సంధర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. చాలా విభిన్న వస్త్రధారణలతో ర్యాంపు పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.