తీహార్ జైలులోని సెల్ నంబర్ 8, 9లో ఉన్న ఖైదీల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత ఉన్న తీహార్ జైల్లో ఖైదీల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలిసీ కేసులో అరెస్ట్ అయిన కవిత.. గత ఐదు నెలలుగా జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో నిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే, ఇప్పటికే కవిత ఆరోగ్య విషయంపై చింతిస్తున్న ఆమె అభిమానులు, పార్టీ శ్రేణుల్లో మరో ఆందోళన నెలకొంది.
తీహార్ జైల్లోని ఖైదీల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు వెల్లడించారు. తీహార్ జైలులోని సెల్ నంబర్ 8, 9లో ఉన్న ఖైదీల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడడంతో హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. తీహార్ జైల్లో గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ పాలిసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయా పార్టీలకు చెందిన అభిమానులు, నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.