మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం తిని వందమంది విద్యార్థులు దవాఖానా పాలయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్ : మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం తిని వందమంది విద్యార్థులు దవాఖానా పాలయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది. సిరాపూర్ గ్రామంలోని ఉదయ నారాయణ్ నోడల్ స్కూల్లో విద్యార్థులకు ఎప్పట్లాగే మధ్యాహ్న సమయంలో భోజనం వడ్డించారు. విద్యార్థులు తింటుండగా ఒక విద్యార్థికి ఆహారంలో బల్లి వచ్చింది. వెంటనే ఉపాధ్యాయులకు చెప్పగా భోజనం వడ్డించడం నిలిపేశారు. ఆ కొద్దిసేపటికే భోజనం తిన్న విద్యార్థులకు కడుపు నొప్పి, ఛాతినొప్పి లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని ప్రైవేటు వాహనాలు, అంబులెన్సుల ద్వారా సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.
స్వల్ప లక్షణాలున్న విద్యార్థులకు స్కూల్లోనే వైద్యం అందించగా.. పరిస్థితి కాస్త విషమంగా ఉన్న విద్యార్థులను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి వైద్యం చేశారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.