అవసరం తీరాక ప్రజలను ముంచడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ నిరుద్యోగ యువతను కేసుల పాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజా భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కహానీలు చెప్పిందని ఆయన అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదు.. జారుకునే క్యాలెండర్ అని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అన్నారు. అదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలని మరిపించడానికే ఈ జాబ్ క్యాలెండర్ అని ఆయన అన్నారు.
జాబ్ క్యాలెండర్‌లో జాబ్ లేదు, క్యాలెండర్ లేదు అని ఆయన ఎద్దేవా చేశారు. క్యాలెండర్ అంటే తేదీలు ఉండాలి.. అవి కూడా లేవని స్కూల్ పిల్లలు కూడా నవ్వుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల సంఖ్య, నోటిఫికేషన్ తేదీలు స్పష్టంగా ఉంటేనే అది జాబ్ క్యాలెండర్ అవుతుందని అన్నారు. బీహార్, కర్ణాటక జాబ్ క్యాలెండర్లు బాగున్నాయని అన్నారు.
అవసరం కోసం కాంగ్రెస్ ప్రజలను వాడుకొని వదిలేసిందని ఆయన అన్నారు. అవసరం తీరాక ప్రజలను ముంచడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన పార్టీ లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ నిరుద్యోగ యువతను కేసుల పాలు చేస్తోందని ఆరోపించారు. ప్రజా భవన్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం కహానీలు చెప్పిందని ఆయన అన్నారు.
జీవో-46 బాధితులపై ప్రజా భవన్ వద్ద పోలీసులు హింసించారని ఆయన అన్నారు. జీవో-46 బాధితులు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కనీసం స్పందించడం లేదని అన్నారు. పోలీసులతో నియంతృత్వం ప్రదర్శించడం ప్రజాపాలన అవుతుందా రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. కోర్టులో కూడా జీవో-46పై విచారణ పదే పదే వాయిదా పడటం బాధాకరమని అన్నారు.
అసెంబ్లీ సమావేశాలు చూస్తే అమెజాన్ అడవులు చూసినట్టుందని రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే తోలు తీస్తా అంటున్నాడు.. కుస్తీకి సై అని హెచ్చరిస్తున్నాడు. కుస్తీకి అసెంబ్లీ ఎందుకు.. ఆ ఎమ్మెల్యే కుస్తీశాలకు వెళ్లాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకుంటోందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగుల కాళ్లు పట్టుకున్నారు. ఇప్పుడేమో కంఠాలు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని రాకేష్ రెడ్డి హెచ్చరించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి గెలిచిన ఎంపీలు అడగాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.