ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.
న్యూస్ లైన్ డెస్క్: బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి మోసపోతున్న తెలంగాణ వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికే గడిచిన 6 నెలల్లో 21 మంది కామారెడ్డి వాసులు గల్ఫ్‌లో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగాల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి గల్ఫ్ దేశానికి పంపి ఏజెంట్లు మోసం చేస్తున్నారని మృతుల కుటుంబసభ్యులు వాపోతున్నారు. అక్కడికి చేరుకోవడానికి తాము చేసిన అప్పు తీర్చే దారి లేక.. వెనక్కి తిరిగి రాలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్ నుంచి సుమారు 3 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా, మ్యానిఫెస్టోలోకూడా ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కేరళ మాదిరిగా గల్ఫ్ దేశాలకి వెళ్లే వారికి ముందస్తు నైపుణ్య శిక్షణ, అక్కడ కేసుల్లో చిక్కుకున్న వారికి న్యాయ, వైద్య సహయం అందించాలని గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలను నియంత్రించడం వంటి చర్యలు తీసుకోవాలని గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాల నేతలు కోరుతున్నారు.