Harish Rao: రేపటి నుంచి హరీష్ రావు దేవుళ్ల యాత్ర

ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.


Published Aug 21, 2024 05:46:31 AM
postImages/2024-08-21/1724236805_htemple.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారని ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయం దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయబోతున్నామని అన్నారు. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటామన్నారు. ముఖ్యమంత్రి పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని స్వామిని ప్రార్థిస్తామని తెలిపారు.

49వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో రేవంత్ చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు. క్యాబినెట్‌లో నిర్ణయించిన 31వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని తెలిపారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో 26వేల కోట్లకు కుదించారన్నారు. కాగా, ఆగస్టు15 నాడు రుణమాఫీ పూర్తయిందని చెప్పి 17వేల కోట్లన్నారని తెలిపారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారని తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారని రైతుల గోసను తెలిపారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు రేపు ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటానాని అన్నారు. రైతలందరి తరుఫున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుదామని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress cm-revanth-reddy harish-rao temple

Related Articles