తెలంగాణ శాసనసభలో మహిళలకు మాట్లాడే హక్కు లేదా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ శాసనసభలో మహిళలకు మాట్లాడే హక్కు లేదా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో దుశ్శాసనపర్వం నడుస్తోందని, అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఒక్క మాట మాట్లాడలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినట్లు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. బయట జరుగుతున్న సంఘటనలకు, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు తేడా లేదన్నారు. భట్టి తనకు రేవంత్ రెడ్డిపై ఉన్న కోపాన్ని సబితా ఇంద్రా రెడ్డిపై చూయించారు. భట్టికి ఎప్పుడో ప్రతిపక్ష హోదా పోయిందని ఇప్పుడు బాధపడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న శాంతిభద్రతలపై మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. నిన్నటి నుండి సబితా ఇంద్రారెడ్డికి అసెంబ్లీలో రెండు నిమిషాలు అవకాశం ఇవ్వలేదని, సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను సరిగా పని చేయనివ్వడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల బంధువుల పాత్ర ఉందన్నారు. సబితక్కనే చూసి వణికి పోతున్న ఈ లిల్లిపుట్లు.. కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేడు అంటున్నారని విమర్శించారు. ఏమిటికి మీ మొహానికి కేసీఆర్.. సబితక్కకు రెండు నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికి పోతున్న మీకు కేసీఆర్ దేనికి రా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి సీఎం అనే సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని, మహిళలకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా చేశారన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడకుండా 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడించారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించామో ప్రజలు అనుకుంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం ఏలాలని చూస్తున్నారు. సభలో లేని వ్యక్తులపై మాట్లాడకూడదని, సభలో లేని వారిపై స్పీకర్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలని అయినా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బండారం బట్టబయలు అవుతుందని ప్రభుత్వం భయపడుతోందని, సీఎం ప్రవర్తనతో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలని, స్పీకర్ సభలో మా హక్కులను కాపాడాలన్నారు. అసెంబ్లీ పట్ల ప్రజల్లో గౌరవం తగ్గే విధంగా వ్యవహరించవద్దని, సీఎం ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు.
తను సబ్జెక్ట్ మాట్లాడితే తనపై సీఎం వ్యక్తిగత ఆరోపణలు చేశారని, సభకు తాగివచ్చే వారితో తనను తిట్టించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము, ధైర్యం వుంటే సబితకు మైక్ ఇవ్వాలని, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్ని తప్పులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం లక్షన్నర రుణమాఫీ చేస్తే రూ. 11 వేల కోట్లు కాలేదు.. అదో రుణమాఫీనా? అని ప్రశ్నించారు. రైతులను దొంగలుగా రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి చేశారు. లక్షల కోట్ల రుణాలు తీసుకున్న బ్యాంకు దొంగలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నారు. అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడించకపోయినా ప్రజాక్షేత్రంలో మాట్లాడతామని, ఎప్పుడు అసెంబ్లీకి రావాలో కేసీఆర్‌కు బాగా తెలుసు అన్నారు. మీ బాసుల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని, ధరణిపై చర్చ పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. డెమోక్రటిక్‌గా ఉంటున్నామనే పదాన్ని బట్టి పట్టి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము ఒక్కరు మాట్లాడితే ప్రభుత్వం నుంచి ఐదుగురు మంత్రులు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు.