రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేవలం రూ. 5 లక్షలు నష్టపరిహారం ప్రకటించటం అన్యాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.. మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని రూ. 25 లక్షలు పరిహారం ప్రకటించాలని సీఎం రేవంత్‌కు సూచించారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరముందని తెలిపారు.
వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే అంతకన్నా మోసం మరొకటి ఉండదని ముఖ్యమంత్రిపై కేటీఆర్ మండిపడ్డారు. అదే విధంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు సాయం చేస్తామన్న హామీని కూడా నేరవేర్చంచాలని తెలిపారు. ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, ముందస్తు ప్రణాళిక లేకపోవటం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ఇకనైనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు చర్యలు చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా కల్పించాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.