కాళోజీ 'గొడవ' ప్రజల గొడవ.. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అంటూ ట్వీట్ చేశారు. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు చేసిన రచనలు మాటల తూటాలు అని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: ప్రజా కవి, పద్మ విభూషణ్ స్వర్గీయ కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆయనకు నివాళి తెలిపారు. కాళోజీ 'గొడవ' ప్రజల గొడవ.. తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అంటూ ట్వీట్ చేశారు. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు చేసిన రచనలు మాటల తూటాలు అని వెల్లడించారు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు వేశారని గుర్తుచేశారు.
ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే, హక్కుల పరిరక్షణే, ప్రజా శ్రేయస్సునే తన జీవితంగా భావించిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ అని కొనియాడారు. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ స్వాతంత్య్ర సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయమని తెలిపారు. కాళోజీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నత ఉద్దేశంతోనే కాళోజీ జయంతిని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారని కేటీఆర్ తెలిపారు. వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టి.. వరంగల్‌లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారని తెలిపారు.