జర్నలిస్ట్ శంకర్ పై
సర్కారు మరో కుట్ర..!
ప్రజలపక్షాన నిలబడినందుకు అక్రమకేసులు
ఇప్పటి వరకు 18 కేసులు పెట్టిన ప్రభుత్వం
గతేడాది ఆఫీస్ ముందే శంకర్ పై హత్యాయత్నం
ఆ తర్వాత కొండారెడ్డిపల్లి వెళితే మరోసారి హత్యాప్రయత్నం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు కుట్రలు
"తెలంగాణం" పత్రికలో వాస్తవాలు రాసినా కేసులు
సర్కారు తప్పుడు కేసులు, దాడులపై ఏఐసీసీ ఆఫీస్ ముందే ధర్నా
ఎన్ని కుట్రలు చేసినా ప్రశ్నించడం మానని జర్నలిస్ట్ శంకర్
వ్యక్తిత్వ హననం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రయత్నాలు
గతంలోనూ ఫేక్ క్లిప్పింగులతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
ఇప్పుడు శంకర్ పై మరోసారి అక్రమ కేసు
తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైపోతోంది. ప్రజల కష్టాలను ప్రపంచానికి చూపించడం.. సర్కారు వైఫల్యాలను బయటపెట్టడం క్షమించలేని నేరమైపోయింది. ప్రజలపక్షాన నిలబడినందుకు జర్నలిస్ట్ శంకర్ పై "న్యూస్ లైన్ తెలుగు" ఛానల్ పై, "తెలంగాణం" దినపత్రికపై కక్షగట్టింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. అక్రమ కేసులు పెడుతూనే ఉంది. ఇప్పటి వరకు జర్నలిస్ట్ శంకర్ పై సర్కారు 18 కేసులు పెట్టింది. అయినా ప్రజల పక్షాన నిలబడటంతో... వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. సరిగ్గా ఏడాది క్రితం అలాంటి ప్రయత్నమే చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నం చేసింది.
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 29) : ప్రజల సమస్యలను ప్రపంచానికి చూపిస్తున్న పాపానికి జర్నలిస్ట్ శంకర్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టింది. 2023లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొద్దిరోజులకే రైతులు రైతుబంధు కోసం రోడ్డెక్కారు. ఈ అంశాన్ని కవర్ చేసినందుకు మొదలైన బెదిరింపులు ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. రైతుబంధు ఎప్పుడిస్తారని అడిగిన పాపానికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఫోన్లు చేసి బండబూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కొడంగల్ లో ప్రభుత్వ భవనాల కోసం దళిత బిడ్డలకు ఇచ్చిన అసైన్డ్ భూములను తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. దళిత బిడ్డలు న్యూస్ లైన్ ను సంప్రదించడంతో జర్నలిస్ట్ శంకర్ అక్కడికి వెళ్లి వారి బాధను ప్రపంచానికి చూపించారు. ఆ వీడియో పబ్లిష్ అయిన మరుసటి రోజే గతేడాది ఫిబ్రవరి 22వ తేదీన న్యూస్ లైన్ ఆఫీస్ ముందే అధికార పార్టీ గూండాలు హత్యాప్రయత్నం చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం అమ్మాయిలను స్కూటీపై పంపించి.. అమ్మాయిలను వేధించారన్నట్టుగా చిత్రీకరించి దాడి చేశారు. కానీ వాళ్ల కథ, స్క్రీన్ ప్లే మొత్తం సీసీ కెమెరాల్లో దొరికిపోయింది. వాళ్లు ఎలా వచ్చారు.? ఎవరు తీసుకొచ్చారు.? ఎలా వచ్చి కారును ఢీకొట్టారు..? తర్వాత వాళ్లే వచ్చి ఎలా దాడిచేశారనే పిన్ టూ పిన్ అంశాలన్నీ అందులో రికార్డయ్యాయి. దీంతో అప్పుడు తోకముడిచారు. అయినా కూడా ఫేక్ క్లిప్పింగులు తయారుచేసి సోషల్ మీడియాలో ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ దాడి జరిగిందని జర్నలిస్ట్ చేసిన ఫిర్యాదును ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోలేదు.
అయితే.. ఇలా దాడి చేసినా జర్నలిస్ట్ శంకర్ ప్రజల పక్షాన మాట్లాడటం ఆపలేదు. తనపై దాడి జరిగిన కొద్ది రోజులకే సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లోని ఓ తండాలో లంబాడా బిడ్డలపై స్థానిక పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో డీజే పెట్టినందుకు లంబాడా యువకులను దారుణాతిదారుణంగా హింసించారు. బాధితులు జర్నలిస్ట్ శంకర్ కు తమ గోడు వెళ్లబోసుకోవడంతో అక్కడికి వెళ్లి వారి బాధను ప్రపంచానికి చూపించారు. ఇది సర్కారుకు నచ్చలేదు.
లగచర్లలో ఫార్మాసిటీ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ తమ పంట పొలాలు లాక్కుంటుందంటూ అక్కడి గిరిజన బిడ్డలు జర్నలిస్టు శంకర్ ను కలిశారు. తమ బాధ చెప్పుకున్నారు. తమ గొంతుగా ఈ సమాజానికి అక్కడి వాస్తవ పరిస్థితులను చూపించాలని కోరారు. దీంతో శంకర్ ఫార్మాసిటీకి సంబంధించిన లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాలకు వెళ్లారు. అక్కడి ప్రజల సమస్యలు చూపించడంతో పాటు ఆ పంట పొలాలను బయటి ప్రపంచానికి చూపించారు. గిరిజన బిడ్డల గొంతునూ వినిపించారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములనీ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు తప్పని నిరూపించారు. పచ్చని పంటలతో సిరులు పండేవని ఈ సమాజానికి చూపించారు. దీంతో మరింత కక్ష పూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది. సీఎం చెప్పిన మాటలు తప్పని రుజువు చేయడంతో రగిలిపోయింది.
ఆ తర్వాత కూడా రాష్ట్రంలోని రైతుల సమస్యలు, రైతుబంధు, రుణమాఫీ వంటి అంశాలపై జర్నలిస్ట్ శంకర్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. వంద రోజుల్లో నెరవేరుస్తామని కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలపైనా నిలదీశారు. ప్రజాసంక్షేమాన్ని పక్కనపెట్టి.. పేర్లు మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వంటి పనులు చేస్తే వాటిపైనా సర్కారును నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వాటిని "న్యూస్ లైన్ తెలుగు", "తెలంగాణం" వేదికగా ప్రపంచానికి చూపించారు. ఇవన్ని సర్కారుకు నచ్చలేదు. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ కేసుల మీద కేసులు పెడుతూ పోయారు.
చివరకు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగింది. రుణమాఫీపై ప్రజాభిప్రాయాన్న తెలుసుకునేందుకు వెళ్లిన జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ అంశాన్ని కవర్ చేసేందుకు ఇతర మీడియా సంస్థల ప్రతినిధులతో కలిసి న్యూస్ లైన్ టీం కూడా అక్కడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాంగ్రెస్ గూండాలు మరోసారి హత్యాప్రయత్నం చేశారు. దాదాపు 25 కిలోమీటర్లు కార్లలో ఛేజ్ చేశారు. కార్లతో గుద్ది చంపేందుకు ప్రయత్నించారు. చివరకు వెల్దండ పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ పైనా దాడికి ప్రయత్నించారు. చివరకు పోలీస్ ఎస్కార్ట్ తో హైదరాబాద్ రావాల్సి వచ్చింది. దీన్ని బట్టి జర్నలిస్ట్ శంకర్ పై సర్కారు ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.
సర్కారు దాడులపై, అక్రమ కేసులపై నేరుగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు, రాహుల్ గాంధీ నివాసం ముందు ధర్నా చేయాల్సి వచ్చింది. తెలంగాణలో జర్నలిస్టుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తే దాడులు కాస్త ఆగాయి. కానీ సోషల్ మీడియాలో, ఫోన్లలో బెదిరింపులు, అక్రమ కేసులు ఆగలేదు. సాధారణంగా మీడియాకు రాజకీయ వర్గాల నుంచి వచ్చే సమాచారంతో వార్తలు రాసినా కూడా కేసులు పెట్టారు. ఇప్పటి వరకు ఏకంగా 18 కేసులు పెట్టారు. అవన్ని కుట్ర పూరితంగా పెట్టినవి కావడంతో కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయి.
మరోవైపు.. సర్కారు ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా జర్నలిస్ట్ శంకర్ ప్రశ్నించడం మానలేదు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో ఓ సారి దాడి చేసి ఆపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇప్పుడు మరోసారి అవే కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు కాబట్టి.. క్యారెక్టర్ ను దెబ్బతీస్తే ప్రజల్లో పలుచన అవుతారని సర్కారు పెద్దలు ఆలోచించినట్టున్నారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తే అతను చెప్పే వార్తలను ప్రజలు నమ్మరని, ప్రజల నుంచి జర్నలిస్ట్ శంకర్ దూరం అవుతాడని అనుకున్నట్టున్నారు. అందుకే ఇలా పక్కా ప్రణాళికతో ఓ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.