నేను అనుకుంటే
మిమ్ములందరినీ లోపలేస్తా !
ఒక్కరూ కూడా బయట ఉండరూ
అందరూ చర్లపల్లి జైల్లోనే ఉంటరు
ఇంకెప్పుడు వేస్తావని అందరూ అడుగుతుండ్రు
నేను కక్ష సాధింపు చేస్తలేను
నన్ను తిట్టినా కేసులు పెట్టించలేదు
రానున్న 4 ఏళ్లకు మరో రూ.4.5 లక్షల కోట్ల అప్పు
ప్రతి నెల రూ.10 వేల కోట్లు తేవాల్సిందే
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణం, హైదరాబాద్ (మార్చి 27) : ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారలతో నేను తలచుకుంటే బీఆర్ఎస్ వాళ్లను లోపలవేసి వాడనని, ఒక్కరూ కూడా బయట ఉండేవాళ్లు కాదని, చర్లపల్లి జైలో, లేక చంచల్ గూడ జైల్లోనే ఉంటరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ నన్ను అందరూ అడుగుతున్నారని, ఇంకెన్నీ రోజులు వాళ్లను బయట ఉంచుతారని, లోపల వేయమని అంటున్నారని తెలిపారు. నన్ను తిట్టినా కూడా ఎవ్వరి మీద అక్రమ కేసులు పెట్టించలేదని, నన్ను తిట్టిన వాళ్ళ చెంపలు పలగొట్టే శక్తి ఉన్నా ఊరుకున్నానని చెప్పారు. కక్ష సాధింపు చర్యలు చేయాలని అనుకుంటే అందర్నీ జైల్లో వేసేవాడినని తెలిపారు. డ్రోన్ ఎగరేసినందుకు రూ.500 ఫైన్ వెయ్యాలి కానీ నన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారని అన్నారు. చర్లపల్లి జైలుకు పంపి నక్సలైట్లు, తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో 16 రోజులు వేశారని అన్నారు. సెల్ లో చిన్న బాత్ రూమ్ లో కూర్చుంటే బైటకి కనిపించే లాగా ఉంటుందని, కావాలంటే ఎమ్మెల్యేలను, మంత్రులను తీసుకెళ్లి చూపిస్తానని తెలిపారు. ఒక్కరోజు రాత్రి కూడా నిద్రపోలేదన్నారు. ఆ కోపాన్ని దిగమింగుకొని పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.
నెలకు రూ.10వేల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. 15 నెలల్లోనే రూ.లక్షా 53వేల కోట్ల అప్పు తీసుకొచ్చామని, రాబోయే నాలుగున్నర ఏండ్లలో మరో రూ.4 లక్షల 50 వేల కోట్లు అప్పు చేస్తామని చెప్పారు. రాబోయే 45 నెలల్లో, నెలకు రూ.10 వేల కోట్ల లెక్కన రూ.4 లక్షల 50 వేల కోట్లు అప్పు చేయాల్సిందేనని, ఈ ఐదు ఏళ్లలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రూ.12,291 కోట్ల 73 లక్షల రైతుభరోసా చెల్లించినట్లు చెప్పారు. సన్న వడ్ల కింద ఇప్పటి వరకు క్వింటాలుకు రూ.500 బోనస్ కింద రూ.1,162 కోట్లు ఇచ్చామని అన్నారు. 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని, రూ.15,333 కోట్లు ఉచిత కరెంటు కోసమే చెల్లించామన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు... కరెంటు అంటేనే కాంగ్రెస్ అనేలా పరిపాలన చేస్తున్నామని చెప్పారు. 25లక్షల 35వేల 964 మందికి రూ.20,616 కోట్ల 89లక్షలతో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేశామని ప్రకటించారు.