KTR: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జాగేది.. జాడేది?

తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ  దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.


Published Jul 23, 2024 03:11:10 PM
postImages/2024-07-23//1721727670_bbce2.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ  దక్కింది శూన్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రూ. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని ఆరోపించారు.  బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే అని కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని, ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేవటం లేదని, ఐఐఎం సహా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. 


తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని, మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగిన కూడా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా పట్టించుకోలేదని, తెలంగాణకి మరోసారి ఈ కేంద్ర బడ్జెట్లో దక్కింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. 16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ ఘటన మాకు తెలియజేస్తోందన్నారు. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని విమర్శించారు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు అన్నారు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుండు సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని కేటీఆర్ తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : kcr india-people revanth-reddy brs ktr centralbudget

Related Articles